‘రూ.6 వేల కోట్లు స్వాహా చేశారు’

Jana Chaitanya Vedika V Lakshmana Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధించి చంద్రబాబు పాత్ర ఏమీ లేదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఐదేళ్ల కాలంలో 12 వేల కోట్లు వ్యయం చేస్తే.. వాటిలో 6 వేల కోట్లు అధికారపార్టీ నేతలు, అధికారులు, ఇరిగేషన్ మంత్రి, స్వాహా చేశారని ఆరోపించారు. మెయిన్ డ్యామ్‌ ఇంతవరకూ ప్రారంభం కాలేదని.. అయినా  ఎప్పటికప్పుడు నీళ్లిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో ఐదేళ్ల వరకూ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. రానున్న ప్రభుత్వానికి నిజానిజాలు తెలియజేయడానికే పోలవరం పర్యటన చేస్తున్నామని చెప్పారు. మొత్తం సమాచారం క్రోడీకరించి కొత్తముఖ్యమంత్రికి అందిస్తామని అన్నారు. ఇక కాఫర్ డ్యామ్ అనేది తాత్కాలిక నిర్మాణం మాత్రమేనని అన్నారు.

కాలువల ద్వారా నీళ్లివ్వాలంటే మరో నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ పవర్ ప్రాజెక్టు ఊసే లేదని అన్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఏడు గ్రామాలకు మాత్రమే పునరావాసం కల్పించారని విమర్శించారు. ఇందులో కూడా అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రానున్న ప్రభుత్వం వీటన్నిటిపై విచారణ చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకు నిజనిర్ధారణ కమిటీ నివేదిక రూపొందిస్తుందని అన్నారు.

గంపెడు మట్టి కూడా పడలేదు..
ఇప్పటివరకూ అందరూ పోలవరం నుంచి నీళ్లిస్తారనే భ్రమలో ఉన్నారని, కానీ ఇప్పటివరకూ మెయిన్ డ్యామ్‌ నిర్మాణానికి గంపెడు మట్టి కూడా పడలేదని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీరు ప్రభాకరరెడ్డి చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతిచ్చిన 28 మీటర్ల ఎత్తుకంటే అధికంగా 42 మీటర్ల ఎత్తున కాఫర్ డ్యాం కడుతున్నారని దీనివల్ల ఏం సాధించదలుచుకుందో అర్దం కావడం లేదని అన్నారు. ఏడున్నర లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వాల్సిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా సర్వే జరగలేదని వెల్లడించారు. నాగార్జునాసాగర్ 1956లో మొదలు పెడితే కాలువలకు పూర్తి స్థాయిలో నీరివ్వడం 2000వ సంవత్సరం వరకూ కొనసాగిందని గుర్తు చేశారు.

బాబు ఓ పిట్టల దొర
చంద్రబాబు ఓ గ్రాఫిక్ పిట్టల దొర అని సామాజికవేత్త, ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును చూసేందుకని కోట్లరూపాయలు వెచ్చించడం దారుణమని అన్నారు. ఇక కాఫర్ డ్యామ్‌ నుంచి సాగునీరు సప్లై చేస్తామని చెప్పడ అసాధ్యమని చెప్పారు. చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి ప్రకటనలు చూస్తే వారిపై 420 కేసు నమోదు చేయాలనిపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్‌ఈ ఉప్పల పాటి నారాయణరాజు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top