
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చిక్కుకుపోయిన వేలాది మంది వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజులా వ్యవహరిస్తున్నారని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా కాలినడకన వెళుతున్న వలస కూలీల కష్టాలను చూసిన ఏపీ ప్రభుత్వం వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు పంపడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం గొప్పవిషయమన్నారు. దీని పై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోందని పేర్కొన్నారు.
వలస కూలీలకు భోజన, వసతి సౌకర్యాలను కల్పించి శ్రామిక్ రైళ్లల్లో వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. వలస కూలీల దారి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.500 లను ఇవ్వడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఉపాధి కోసం వేలాది కిలోమీటర్లు వెళ్లిన వలస కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందేన్నారు. లాక్‌డౌన్‌తో చేతిలో చిల్లిగవ్వ లేక పరాయి రాష్ట్రాల్లో అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలు ప్రాణాలకు తెగించి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తమ కాళ్లనే నమ్ముకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని చిత్తూరు మీదుగా తరలివస్తున్న కూలీలను మానవతా దృక్పధంతో ఆదుకోని ఇక్కడ వారి కోసం ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం అభినందిచాల్సిన విషయమని కొనియాడారు. వారికి వసతి, ఆహారం అందించడంతో పాటు వైద్యపరీక్షలు చేసి ఆరోగ్యధృవీకరణలు అన్ని చేసిన తరువాత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి సొంత ప్రాంతాలకు పంపుతున్నట్లు లక్ష్మణరెడ్డి వివరించారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,10,000 మంది వలస కూలీలను వారి సొంత జిల్లాలకు పంపారని తెలిపారు. ఇప్పటి వరకు పరాయి రాష్ట్రంలో సొంతవారికి దూరంగా వేదనాభరిత జీవనాన్ని కొనసాగించిన వలస కూలీలు సొంత ఊళ్లకు చేరుకోవడంతో వారి కళ్లల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు.