కదనపథంలో..కదం తొక్కుదాం

కదనపథంలో..కదం తొక్కుదాం - Sakshi


 గెలుపు ఎవరినైనా వరించొచ్చు గాక.. మడమ తిప్పని పోరాటమే ధీరుని లక్షణం. నాలుగున్నరేళ్లు జనపక్షాన అలుపెరగని కదనం సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్షనేత గా రెట్టింపు ధీరత్వంతో పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. ‘నువ్వా, నేనా’ అన్నట్టు సాగిన ఎన్నికల పోరులో ‘ఫొటో ఫినిష్’ లాంటి అతిస్వల్ప వ్యత్యాసంతో అధికారం చేజారినా.. ప్రజల తరఫున పోరులో మరింత కాకలు తీరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికారపక్షం ఏ మాత్రం జనకంటక విధానాలకు ఒడిగట్టినా.. ఎండగట్టాలని ఎలుగెత్తారు.     

 

 సాక్షి, రాజమండ్రి :‘నాలుగున్నరేళ్లు అలుపెరగని పోరు సాగించాం. అధికారంలోకి వస్తామని భావించాం. దొంగ హామీలతో చంద్రబాబు ప్రజలను మాయచేసి గెలిచారు. బాబు మోసాలను ఎండగడదాం. ప్రజల పక్షాన పోరాడదాం. భవిష్యత్‌పై భరోసాతో ముందుడుగు వేద్దాం’ అంటూ బుధవారం రాజమండ్రి వేదికగా ప్రారంభమైన ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. తొలిరోజు జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి నియోజకవర్గాల్లో  పార్టీ గెలుపోటములపై సమీక్షించారు.

 

 హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఘన  స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న జగన్‌కు మంగళవారం రాత్రి గోదావరిలో బోటు బోల్తా పడి అయిదుగురు మృతి చెందిన విషయాన్ని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజా వివరించగా చలించిపోయారు. సమీక్షలకు ముందే వారి కుటుంబాలను పరామర్శించాలని హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వె ళ్లారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ పరంగా ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం తిరిగి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని సమీక్షలకు శ్రీకారం చుట్టారు.

 

 పేరుపేరునా పలకరిస్తూ.. ప్రతి పలుకూ ఆలకిస్తూ

 ఉదయం 12 గంటలకు ప్రారంభ మైన సమీక్షలు రాత్రి 11 గంటల వరకు సాగాయి. తొలిరోజు జిల్లాలోని తుని, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా సమీక్షించారు. తొలుత ఒక్కో సమీక్షకు అరగంట మాత్రమే కేటాయించినా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మనోభావాలు తెలిపేందుకు ఆసక్తి చూపడంతో వారిని నిరుత్సాహపర్చకుండా సూచనలు, సలహాలు తీసుకుని వారిలో ఉత్తేజాన్ని నింపారు. అధినేత తమను పేరుపేరునా పలకరించడం, తాము చెప్పిన అంశాలను ఓపిగ్గా చెరగని చిరునవ్వుతో నోట్ చేసుకోవడం కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపాయి.

 

 గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఓటమి చెందిన కొద్దిరోజులకే ఒక పార్టీ రాష్ట్రాధినేత ఇలా జిల్లాలకు వచ్చి నియోజకవర్గ సమీక్షలు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, పార్టీ లోటుపాట్లు తెలుసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం ఇతోధికమైంది. అబద్ధపు హామీలతో ప్రజలను మాయ చేసి గద్దెనెక్కుతున్న చంద్రబాబు బండారం ఈ నెలలోనే బయటపడుతుందని, బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందంటూ జగన్ వారిని ఉత్తేజ పరిచారు. రానున్న ఐదేళ్లలో సాగించే పోరుబాటలో అధికార పార్టీ కేసులు, వేధింపులు ఎక్కువవుతాయని, అయినా ప్రతి కార్యకర్తకూ  అండగా ఉంటానని అన్నప్పుడు కార్యకర్తలు ‘జై జగన్’ అంటూ నినదిం చారు. పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని, నేతలు సమన్వయంతో కార్యకర్తలకు అండగా ఉండాలని జిల్లాలోని పలు నియోజకవర్గాల సమీక్షల్లో నాయకులు, కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

 

 వెల్లివిరిసిన ఉత్సాహం

 రాష్ర్ట స్థాయి సమీక్షలకు తూర్పు నుంచే శ్రీకారం చుట్టడం, అందుకు చారిత్రాత్మక రాజమండ్రి వేదిక కావడంతో జిల్లా పార్టీ శ్రేణుల ఉత్సాహం వెల్లివిరిసింది. సమీక్షలతో సంబంధం లేకుండా జగన్‌ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ ప్రాంతం కిక్కిరి సి పోయింది. కాగా రాత్రి 11.30 గంటలకు రం పచోడవరం నియోజకవర్గ సమీక్ష ప్రారంభమై, కొనసాగుతోంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు,ఆ దిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సు భాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, పార్టీ సీజీ సీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,

 

  పెండెం దొరబాబు, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, గిరజాల వెంకటస్వామినాయుడు, చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, రాష్ర్ట సేవాదళ్, యూత్ కమిటీ సభ్యులు సుం కర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, అనుబంధ కమిటీల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మార్గన గంగాధర్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, పంపన రామకృష్ణ, గారపాటి ఆనంద్, మంతెన రవిరాజు, పార్టీ అధికార ప్రతినిధి పి.కె.రావు, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, మాకినీడి గంగారావు, లాలం బాబ్జి, కర్రి సత్యనారాయణ, గుబ్బల వెంకటేశ్వరరావు, రావు చిన్నారావు, అయితే శోభ, ముప్పన వీర్రాజు, అత్తిలి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top