నిజమే... అది అవినీతి జైలే! | it's true... corruption jail! | Sakshi
Sakshi News home page

నిజమే... అది అవినీతి జైలే!

Nov 16 2014 2:29 AM | Updated on Aug 15 2018 7:18 PM

నిజమే... అది అవినీతి జైలే! - Sakshi

నిజమే... అది అవినీతి జైలే!

గుడివాడ సబ్‌జైలులో కొంత మంది జైలు అధికారుల అవినీతి తవ్విన కొద్దీ బయట పడుతోంది.

* గుడివాడ సబ్‌జైలులో తవ్విన కొద్దీ అవినీతి
* ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా
* సాక్షి కథనంతో మరిన్ని వాస్తవాలు

గుడివాడ : గుడివాడ సబ్‌జైలులో  కొంత మంది జైలు అధికారుల అవినీతి తవ్విన కొద్దీ బయట పడుతోంది.  అక్కడ జరుగుతున్న అవినీతి బాగోతంపై ‘గుడివాడ సబ్‌జైలులో అవినీతి కంపు’ శీర్షికన శనివారం ఓ కథనం ప్రచురితమయ్యింది. దీంతో డబ్బు కోసం జైలు సిబ్బంది  తమను వేధించిన తీరుపై మరికొంతమంది బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.  చిన్నపని నుంచి పెద్ద పని వరకు అధికారులు నోటికొచ్చినంత అడిగి తీసుకుంటున్నారనే ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది.
 
బెయిల్ రావడం ఆలస్యమయిందని ...
జైలు నిబంధనల ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే బెయిల్ వచ్చిన వారిని బయటకు పంపేందుకు అనుమతి ఉంది. కానీ రేషన్ డీలర్ల వ్యవహారంలో రెండో బ్యాచ్‌లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన వారిలో 12 మందికి రెండో రోజు సాయంత్రం 6.30 గంటల తరువాత బెయిల్ మంజూరయింది. దీంతో సూర్యాస్తమయం అయింది కాబట్టి బయటకు పంపలేమన్నారు. అయితే ఇందుకోసం రూ.60వేలు లంచంగా ఇస్తే  రాత్రి 9.30    గంటల సమయంలో బయటకు పంపారని విశ్వసనీయ సమాచారం.
 
మజ్జిగ ప్యాకెట్ పంపడానికి రూ.వెయ్యి...
జైలులో ఉన్న రేషన్ డీలర్లలో ఒకరు అనారోగ్యం కారణంగా మజ్జిగ ప్యాకెట్ కావాలని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు ఒక మజ్జిగ ప్యాకెట్‌ను ఫలానా వారికి ఇవ్వాలని జైలు సిబ్బందిని అడిగారు. దీంతో ఒక మజ్జిగ ప్యాకెట్‌కు రూ.వెయ్యి అవుతుందని చెప్పగా గుడ్లు తేలేసిన కుటుంబ సభ్యులు ‘మా నాన్న మజ్జిగ తాగకపోయినా ఫర్వాలేదుగానీ అంత డబ్బు ఇవ్వలేమని వెనుతిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు.
 
ములాఖత్ ఉంటే పంట పండినట్లే....
జైలులో ఉన్న నిందితులు, ముద్దాయిల కోసం కుటుంబ సభ్యులు స్నేహితులు వస్తుంటారు. అయితే జైలులో ఉన్న వ్యక్తికి వారానికి ఒకరితో మాత్రమే ములాఖత్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు అనధికారికంగా లంచాలు దండుకుంటూ రోజుకు పదుల కొద్దీ ములాఖత్‌లు ఇస్తుంటారని చెబుతున్నారు. ఒక్కో సారికి  రూ.300 చొప్పున సమర్పించుకుంటేనే అవకాశం ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధం కాబట్టి రికార్డుల్లో మాత్రం కలసిన వారి పేర్లు ఉండవని తెలుస్తోంది.
 
ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా....
గుడివాడ సబ్‌జైలులో జరుగుతున్న అవినీతి బాగోతంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. జైలులో వెలుగు చూస్తున్న అవినీతి అంశాలపై శనివారం ఉదయం నుంచి ఇంటెలిజన్స్ పోలీసులు పలు మార్గాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అవినీతిపై గుడివాడకు చెందిన సామాజిక కార్యకర్త జిల్లా జైలు అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా జైలులో అవినీతిని నిర్మూలించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement