బాబూ.. మభ్యపెట్టొద్దు | Is .. mabhyapettoddu | Sakshi
Sakshi News home page

బాబూ.. మభ్యపెట్టొద్దు

Mar 16 2015 3:36 AM | Updated on Aug 14 2018 11:24 AM

రాష్ట్రంలో ఆరు ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటూ ప్రజలను....

నంద్యాల: రాష్ట్రంలో ఆరు ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ, పట్టుసీమ, ఎత్తిపోతల పథకం, వంశధార, తోటపల్లి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.8361 కోట్లు అవసరమైతే  రూ.1104 కోట్లు కేటాయించారన్నారు. అరకొర నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. పాత ప్రాజెక్టులను పక్కకు బెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేస్తానని ప్రకటించడం చూస్తుంటే ఆయన మానసిక స్థితిని అనుమానించాల్సి వస్తుందన్నారు.

అలాగే వచ్చే ఏడాది 70 టీఎంసీలతో కడప జిల్లాలో నీటిని నిల్వ ఉంచుతానని, పులివెందులకు నీరు ఇస్తానని పేర్కొనడాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు. అయితే అది ఎటువంటి పరిస్థితిలో సాధ్యం కాదని భూమా పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల వరద నీటిని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ముందు, వెనుక కాల్వల పనులే పూర్తి కాలేదన్నారు. అలాగే గోరుకల్లు రిజర్వాయర్‌ను పూర్తి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఎస్సార్బీసీ, గాలేరునగరి.. తదితర ప్రధాన కాల్వల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గమనించి ఉంటే ఈ ప్రకటన చేయరన్నారు. చివరికి అవుకు రిజర్వాయర్‌లో ఒక టన్నల్ పనిని మాత్రమే పూర్తి చేశారని, మరో టన్నల్ పని పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో పాత తూముపై నిర్మాణాన్ని చేపట్టారని ప్రస్తుతం ఆ పని వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇరిగేషన్ నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని భూమా గుర్తు చేశారు. గండికోట రిజర్వాయర్ నుంచి సర్వరాయసాగర్ మీదుగా నగరికి నీళ్లు తీసుకొని పోతానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
 
మాటలు తప్ప చేతల్లేవు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద మాటలు తప్ప చేతల్లేవని భూమా విమర్శించారు. వైఎస్సార్ జిల్లాలో వచ్చే ఏడాది 70 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని సీఎం చెప్పారని, అయితే ఆయన పర్యటన సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వైపు ట్రిబ్యునల్ సమస్యలు, మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఇరిగేషన్‌ను వెంటాడుతున్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండానే నీటిని నిల్వ చేస్తామని ప్రకటించడం చూస్తుంటే మసిపూసి మారెడుకాయ చేసే విధంగా ఉందన్నారు.

సీమ ప్రాజెక్టులపై చంద్రబాబుకు ఏనాడు ఆసక్తి లేదన్నారు. గతంలో ఓట్లు వేసినప్పుడే సీమ ప్రాజెక్టులను చేపట్టలేదని, ఇప్పుడు ఓట్లు వేయలేదని సీమ ప్రజలపై బాబు విషం కక్కుతున్నారని విమర్శించారు. రాయలసీమకు వచ్చే ఏడాది నీటిని విడుదల చేస్తామని పేర్కొంటున్న భారీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తాను సవాల్ విసిరిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు పూర్తి చేస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, లేని పక్షంలో దేవినేని ఉమ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఆయన సవాల్ విసిరారు. సీఎంగా 1996లో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తానని చెప్పడమే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు.
 
నిధులు రాబట్టడంలో విఫలం
 రాజధాని నిర్మాణం, రైల్వే, పోలవరం ప్రాజెక్టులకు నిధులను రాబట్టడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని భూమా ఆరోపించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసి ప్రజల్లో చులకన య్యారన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ఢీకొంటున్నారని ఇరకాటంలో పడి ఎదురు దాడికి దిగుతూ నోళ్లు నొక్కుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించే తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంపై ఎంత నమ్మకం ఉందో అర్థం కావడం లేదని భూమా అన్నారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పైకి లేస్తేనే ఉలిక్కి పడుతున్నారన్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా సీమకు న్యాయం జరిగింది ఒక్క వైఎస్సార్, ఎన్‌టీఆర్‌ల హయాంలో తప్ప మరే ముఖ్యమంత్రి హయాంలో కాలేదన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల వెంట త్వరలో పీఏసీ బృందం పర్యటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ అక్రమాలపై శాసనసభలోను, బయట పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement