జిల్లాలో డీఎస్సీ పరీక్షకు సంబంధించి జరిగిన మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంపై డీఎస్పీ ఆద్వర్యంలో జరుగుతున్న పోలీసుల దర్యాప్తులో
సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా
వెల్లడవుతున్న నిజాలు
పరీక్షకు ముందు నుంచే ఇచ్ఛాపురం ఎంఈవో, భాస్కరరావుల సంభాషణ ?
చురుకుగా సాగుతున్న పోలీస్ దర్యాప్తు
శ్రీకాకుళం : జిల్లాలో డీఎస్సీ పరీక్షకు సంబంధించి జరిగిన మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంపై డీఎస్పీ ఆద్వర్యంలో జరుగుతున్న పోలీసుల దర్యాప్తులో పురోగతి సాధించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అనుమానితుల అందరి సెల్‌ఫోన్ కాల్‌డేటా పోలీసులకు అందడంతో విచారణలో పురోగతి సాధించగలిగినట్లు సమాచారం. డీఎస్సీ పరీక్షకు పదిరోజుల ముందునుంచే ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిని భర్త భాస్కరరావు పలుసార్లు సంభాషించినట్లు పోలీసులు గుర్తించినట్లు బోగట్టా. పరీక్ష రోజున కూడా వీరిద్దరూ సంభాషించడంతో పాటు పరీక్ష సమయంలో కొందరితో మాట్లాడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ నంబర్లు ఎవరివన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
వీరిద్దరూ ఓ అధికారితో కూడా మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అధికారికి ప్రభుత్వపరంగా వచ్చిన సెల్‌నంబర్‌తో కాకుండా ప్రైవేట్‌నంబర్‌తో మాట్లాడినట్లు పోలీసులు సందేహపడుతూ ఆ దిశగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల్లోగా ఈ కేసు ఓ కొలిక్కి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇచ్ఛాపురం ఎంఈవో ఇచ్చిన సంజాయిషీ పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీకి జిల్లా విద్యాశాఖాధికారి నివేదించారు.
దీంతోపాటు ఎంఈవో వ్యవహారశైలి డీఎస్సీ పరీక్ష సమయంలో అనుమానాస్పదంగా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికారుల అదేశాల మేరకు ప్రాధమిక విచారణ చేపట్టిన ఆర్‌జేడీకి ఈ వ్యవహారంపై అవగాహన ఉండడంతో పాటు డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఈవోను సస్పెండ్ చేసే వీలున్నట్లు తెలిసింది. అయితే పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకోవాలా, వెంటనే చర్యలు తీసుకోవాలా అనే విషయమై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా మాల్‌ప్రాక్టీస్‌లో ఎంఈవో, అభ్యర్థి భర్త కీలక భూమిక పోషించారని అన్ని కోణాల్లోనూ తేటతెల్లమవుతోంది.