డీఎస్సీ అభ్యర్థులకు ‘చుక్కలే’ సమాధానం | New controversy over DSC exams | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు ‘చుక్కలే’ సమాధానం

Jul 8 2025 4:48 AM | Updated on Jul 8 2025 5:06 AM

New controversy over DSC exams

డీఎస్సీ పరీక్షలపై కొత్త వివాదం

సరైన జవాబులు పెట్టినా తప్పులు వచ్చినట్టు ఆరోపణ

ఆన్సర్లు ‘సేవ్‌’ చేయకపోవడంతోనే సమస్య అంటున్న అధికారులు

వాస్తవాలు వెల్లడించాలంటున్న డీఎస్సీ అభ్యర్థులు

రెస్పాన్స్‌ షీట్లతో డైరెక్టరేట్‌ ఎదుట ఆందోళన

కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మెగా డీఎస్సీ–2025 గందరగోళంగా మారింది. ఈ పరీక్షలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర­మైన తప్పులు జరిగాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమా­ధా­­నాలు గుర్తించినా తప్పుగా చూపు­తోంద­ని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొ­న్నింటినే ఆన్సర్‌ చేసినట్టు నమోదైందని ఆధారాలతో చూపుతున్నారు. సమస్యలు పరి­ష్క­రించాలని వారం రోజులుగా పాఠశాల డైరెక్టరే­ట్‌కు అభ్యర్థులు క్యూ కడు­తున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపో­వడంతో సోమవారం రాత్రి డైరెక్టరేట్‌ ఎదుట అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

విద్యాశాఖ జూన్‌ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. వాటి ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్‌ షీట్ల (జవాబు­లతో సహా అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలు)ను ఈ నెల 3వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని చూసిన అభ్యర్థులు తాము గుర్తించిన జవాబులకు, రెస్పాన్స్‌ షీట్లలో ఉన్న వాటికి పొంతన లేదంటున్నారు. మొత్తం 16,437 పోస్టులకు గాను 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించగా.. 5,36,690 దరఖాస్తులకు సంబంధించి అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇందులో చాలామంది ఇప్పుడు ఒకే తరహా సమస్యతో డైరెక్టరేట్‌కు క్యూకట్టారు.  – సాక్షి, అమరావతి

రెస్పాన్స్‌ షీట్లు చూసి షాక్‌
టెట్‌ పరీక్షల్లాగే డీఎస్సీ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. పీఈటీ/పీడీ పరీక్షలకు 100 మార్కులకు గాను 200 బిట్లకు 3 గంటల సమయంలో, ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు 80 మార్కులకు గాను 160 బిట్లకు 2.30 గంటల్లోను జవాబులు గుర్తించాలి. అభ్యర్థులు కంప్యూటర్‌లో కనిపించే మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. జవాబు గుర్తించి సేవ్‌ చేస్తేనే ఆ ప్రశ్న నమోదవుతుంది. మైనస్‌ మార్కులు లేకపోవడంతో అభ్యర్థులు దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినట్టు చెబుతున్నారు. 

ఏళ్ల తరబడి ఇదే పరీక్ష కోసం కసరత్తు చేయడం, డీఎస్సీకి ముందు కూడా ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించడంతో పూర్తిస్థాయి అను­భవంతో పరీక్ష రాసినట్టు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు రెస్పా­న్స్‌ షీట్లు చూసి షాక్‌ తింటున్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా.. 20 నుంచి 60 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా ఉండటంతో కంగుతిన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఎస్జీటీ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను, 150కి జవాబులు గుర్తించగా.. కేవలం 10 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్టు చూపుతోంది. 

మిగిలిన 140 ప్రశ్నల జవాబులకు చుక్కలు నమోదయ్యాయి. పైగా ఆ పది జవాబులు మొత్తం ప్రశ్నపత్రంలో అక్కడొకటి.. అక్కడొకటి చూపడం గమనార్హం. ఇదే తరహాలో కాకినాడ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి ఎస్జీటీతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ మేథమేటిక్స్‌ పరీక్షలు రాయగా.. రెండు పరీక్షల్లోనూ 19 నుంచి 24 ప్రశ్నలకు అసలు సమాధానాలు చూపడం లేదు. తాము పెట్టిన జవాబుకు ఎంపిక వద్ద ఎక్కువ ప్రశ్నలకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్‌) కనిపిస్తోంది. ఇదే సమస్య వందలాది డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొన్నారు. 

పోటీ పరీక్షల్లో ఒక్క మార్కుతోనే తలరాతలు మారిపో­తాయని, ఇప్పుడు డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ జీవితాలు తల్లకిందులవుతున్నాయని అభ్యర్థులు విలపిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో సాంకేతిక సమస్య­లు ఉన్నా సరిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆది నుంచీ వివాదాస్పదమే
కూటమి అధికారంలోకి రాగానే 2024 జూన్‌లో సీఎంగా చంద్రబాబు తొలి సంతకం 16,437 పోస్టులతో డీఎస్సీ ఫైల్‌పై చేశారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చి మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఏడాది పాటు కాలయాపన చేసి ఈ ఏడాది ఏప్రిల్‌ 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. నోటిఫికేషన్‌కు, పరీక్షకు 90 రోజుల గడువునిస్తామన్న హామీని పక్కనబెట్టి కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో ఆప్షన్లు నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 

ఇప్పుడు ఏకంగా అభ్యర్థులు గుర్తించిన జవాబులు కనిపించడం లేదు. ఈ నెల 25 నాటికి ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. డీఎస్సీ పరీక్షల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించకుండా ముందుకెళితే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది. 2018 డీఎస్సీ నిర్వహణలోనూ నాటి టీడీపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. 

అలాగే ఇటీవల గ్రూప్‌–2 మెయిన్స్‌ను సైతం వాయిదా వేస్తామని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే ప్రకటించి అందుకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించడం చూస్తుంటే.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే డీఎస్సీ నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

బ్యాకప్‌ తీస్తామంటున్న అధికారులు
అభ్యర్థులు చెబుతున్న విషయాలతో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. జవాబులు గుర్తించిన తర్వాత సేవ్‌ చేయలేదని.. దాంతో ఖాళీగా కనిపిస్తున్నట్టు చెబుతు­న్నారు. సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి సమస్య లేదంటున్నారు. అభ్యర్థులు రాసిన ఆన్‌లైన్‌ పరీక్షకు సంబంధించి ‘బ్యాకప్‌’ ఉంటుందని.. ఎన్నిసార్లు ప్రశ్నపత్రం తెరిచారు, ఎన్నిసార్లు సేవ్‌ చేశారు, ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారో సమయంతో సహా నమోదవుతుందంటున్నారు. డైరెక్ట­రేట్‌కు వచ్చిన అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు, రెస్పాన్స్‌ షీట్లు తీసుకుని పూర్తి వివరణ ఇస్తామంటున్నారు. అయితే, వారం రోజులుగా అభ్యర్థులు డైరెక్టరేట్‌కు తిరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా బ్యాకప్‌ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement