మారిన ప్రశ్నపత్రం

Intermediate Question Paper Changed in SPSR Nellore - Sakshi

ఇంటర్‌ పరీక్షలో నిర్వాకం

గోప్యంగా ఉంచిన ఇంటర్‌ బోర్డు అధికారులు

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఈనెల 5వ తేదీన జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలో ఓ విద్యార్థినికి కొత్త సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం బదులు పాత సిలబస్‌ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విద్యార్థిని పరీక్ష రాసి బయటకు వచ్చి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సమయంలో ప్రశ్నపత్రం మారిపోయిందని తెలుసుకుని ఆందోళన చెందింది.

ఈనెల 5వ తేదీన సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు జనరల్‌కు సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ ఫౌండేషన్‌ కోర్సు (జీఎఫ్‌సీ) పరీక్ష జరిగింది. అదేరోజు నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న ఓ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి పరీక్ష రాశారు. ఓ విద్యార్థినికి కొత్త సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడున్న పరీక్షల నిర్వహణ సిబ్బంది హడావుడిగా ప్రశ్నపత్రాలను అందజేశారు. విద్యార్థిని పరీక్ష రాస్తున్న సమయంలో కొత్త సిలబస్‌కు చెందిన ప్రశ్నపత్రమా లేక పాత సిలబస్‌కు చెందినదా అని గ్రహించలేక పోయింది. తీరా పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత అది పాత సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం అని తెలుసుకుని అవాక్కైంది. వెంటనే పరీక్షా కేంద్రంలో ఉన్న అధికారులకు చెప్పడంతో వారు కొత్త సిలబస్‌ ప్రశ్నపత్రం ఇచ్చి గంట సమయం ఇచ్చి పరీక్ష రాయించారు.

విచారిస్తా
కొత్త ప్రశ్నపత్రం బదులు పాత ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని చీప్‌ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకుంటాను. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  – శ్రీనివాసులు, ఆర్‌ఐఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top