పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం

Inauguration of Village Secretaries as a festival - Sakshi

జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశం

తూర్పు గోదావరి జిల్లా నుంచి సీఎం జగన్‌ ప్రసంగం

ప్రజలు తిలకించడానికి అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీన ప్రతి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయలను ఏర్పాటు చేస్తుండగా.. అక్టోబరు 2న ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామంలోని సచివాలయంలో ఇంటర్‌నెట్‌తో కూడిన కంప్యూటర్లు తదితర అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ నవరత్న హామీలతో కూడిన బోర్డులను ఉంచాలని చెప్పారు. 

ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలి
అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ సూచించారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతలను మండల ఎంపీడీవోలకు అప్పగించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పని చేసేందుకు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆ మండల పరిధిలోని వలంటీర్లందరూ మండలానికి ఒక గ్రామంలో జరిగే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్న సందర్భంగా ఆయన ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం కాపీని మండల ఈవోపీఆర్‌డీ అక్కడి ప్రజలకు చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా బ్యానర్లు, కళా జాతాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.  

వార్డు సచివాలయాల నుంచే పౌర సేవలు
పురపాలక శాఖ కమిషనర్‌ జె.విజయ్‌కుమార్‌ 
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అక్టోబర్‌ 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారానే పౌర సేవలు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ జె.విజయ్‌కుమార్‌ తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ఈనెల 30న నియామక ఉత్తర్వులు అందిస్తారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తామన్నారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తరువాత ఆ సేవలను దశల వారీగా పెంచుతామన్నారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. వారిలో పరిపాలన కార్యదర్శి ‘స్పందన’ కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top