ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిని..

Ilayaraja disciple Vinod pandugadi Interview - Sakshi

సినీ సంగీతంలో కొత్త కెరటం యాజమాన్య 
తెనాలి:  సినీ సంగీత సాగరంలో కొత్త కెరటం...యాజమాన్య. మ్యూజిక్‌ మాస్త్రో ఇళయరాజాకు ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధం సంగీతమే ప్రపంచమైంది. సినీ నేపధ్యం లేకుండానే సినిమా రంగంలోకి కాలుమోపాడు. కీబోర్డు ప్లేయరుగా వందలాది సినిమాల్లో అనుభవాన్ని రంగరించి, పదికి పైగా సినిమాలకు వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని ముగ్ధులను చేశారు. మరో అయిదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయి. తాజాగా పెదరావూరు ఫిలిమ్‌ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పండుగాడి ఫోటోస్టూడియో’ సినిమా సంగీతం కోసమని తొలిసారిగా నగరాన్ని వదిలి పెదరావూరు వచ్చారాయన.  ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

పాట సంగీతం కేసి తీసుకెళ్లింది.. 
చిత్తూరు జిల్లా పలమనేరు నా స్వగ్రామం. తెలుగు కుటుంబమే. నా పూర్తి పేరు యాజమాన్య వినోద్‌. ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నుంచి ఇంటి పేరు యాజమాన్యగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. మా ఇంట్లో ఎలాంటి సినీ నేపధ్యం లేదు. చదువుకొనే వయసులోనే సినిమా పాటలంటే ప్రాణం. ఇళయరాజా పాటలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ స్ఫూర్తితో సంగీతంపై ఆసక్తి పెరిగింది. గిటార్‌ పట్టేలా చేసింది. కీబోర్డు ప్లేయరయ్యాను. ఎన్నో కచేరీలు చేశాను. వందేమాతరం శ్రీనివాస్‌ బృందంలో చేరాను. ‘జయం మనదేరా’ సినిమా రికార్డింగ్‌లో గిటారిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కొద్దిరోజుల్లోనే కీబోర్డు ప్లేయరుగా అవకాశం లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా పనిచేశాను. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్‌..వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేయటం నా అదృష్టం. 

2014 నుంచి సంగీత దర్శకత్వం
2014 నుంచి సొంతంగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. అంతా కొత్తవారితో తీసిన ‘నువ్వే నా బంగారం’ తొలి సినిమా. ‘పోరా పోవే’, ‘నాటుకోడి’, ‘అనగనగా ఒక చిత్రమ్‌’, ‘టైటానిక్‌’ (అంతర్వేది టు అమలాపురం), ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాక్షసి’, ‘దళపతి’, ‘అనగనగా ఒక ఊరిలో’, ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమాలకు సంగీతం సమకూర్చా. మరో అయిదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పోసాని సినిమా ‘దేశముదుర్స్‌’, ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ’, ‘తమిళ తంబి’, ‘సమీరం’, ‘బొమ్మ అదుర్స్‌’ సినిమాలు మే/జూన్‌లో థియేటర్లకు రానున్నాయి. టైటానిక్‌ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో’, దళపతిలో ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది’, అంటూ శ్రేయోఘోషల్‌ పాడిన పాటలు,  ‘రాజూ..దిల్‌రాజూ’ పాటల యువతరాన్ని ఆకర్షించాయి. 

తొలిసారి గ్రామంలో...
ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్‌లో ఉన్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ను పాటల రికార్డింగు నుంచి సినిమా షూటింగ్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు ఇక్కడే తీయాలనేది దర్శకుడు దిలీప్‌రాజా నిర్ణయం. నగరానికి దూరంగా పెదరావూరు గ్రామంలో పాటల కంపోజింగ్‌ చేస్తున్నాం. ఇదో కొత్త అనుభవం నాకు. జంధ్యాల మార్కు కామెడీతో కూడిన స్క్రిప్టుకు ఆ తరహా పాటల కంపోజింగ్‌ చేస్తున్నాం. 

బ్లాక్‌బస్టర్‌ కోసం.. 
సినిమా సంగీతంలో మునిగితేలుతూనే బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేశా. పెద్ద సినిమాలకు కీ బోర్డు ప్లేయరుగానూ సహకారం అందిస్తున్నా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ జనాలకు వెళుతున్నాయి. ఆదరిస్తున్నారు. బ్లాక్‌ బస్టర్‌ రావాల్సి ఉంది. ఆరోజుకోసం చూస్తున్నా. మెలోడీనే కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలి. అంతర్జాతీయస్థాయిలో ఎదగాలి, అనేది నా లక్ష్యం. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top