జడ్జిపై భర్త ఫిర్యాదు | husband complaint judge in anantapur | Sakshi
Sakshi News home page

జడ్జిపై భర్త ఫిర్యాదు

Published Wed, Dec 24 2014 8:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

తన భార్య, ఆమె తల్లిదండ్రుల నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓ జడ్జి భర్త టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనంతపురం: తన భార్య, ఆమె తల్లిదండ్రుల నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓ జడ్జి భర్త టూటౌన్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదులోని వివరాలు.. అనంతపురం నగరం సాయినగర్‌కు చెందిన కె.జితేంద్రకు హైదరాబాద్‌లోని మియాపూర్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న శ్రీదేవితో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది.

వివాహమైన వారం నుంచి తన భార్యతో మనస్పర్థలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు వరకు అలాగే ఉన్నాయని జితేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ గొడవలు భరించలేక తాను అనంతపురం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది ఆదిశేషారెడ్డితో కలిసి కోర్టులోనే ఉన్నానని వివరించారు. 6 గంటల ప్రాంతంలో ఇంటికెళ్లగా తన భార్య శ్రీదేవి, ఆమె నాన్న వెంకటేశ్వర్లు, అమ్మ అనురాధ, వారి మిత్రుడు శేఖర్ ఉన్నారని వివరించారు.

తనను బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకెళ్లి విపరీతంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు. దెబ్బలకు తాళలేక తప్పించుకుని ఇంటి నుంచి బయట పడి నేరుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నానని, మెడ, ఛాతి, నుదుటి మీద దెబ్బలు తగిలాయని వివరించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై టూటౌన్ సీఐ శుభకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ జితేంద్ర తన భార్య, అత్త, మామలు దాడి చేశారం టూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement