కాయ్‌ రాజా... కాయ్‌...! | Huge bettings on result of Nandyal election | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా... కాయ్‌...!

Aug 24 2017 8:42 AM | Updated on Oct 19 2018 8:10 PM

కాయ్‌ రాజా... కాయ్‌...! - Sakshi

కాయ్‌ రాజా... కాయ్‌...!

నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై భారీ స్థాయిలో పందేలు సాగుతున్నాయి.

- నంద్యాల ఫలితంపై పందేల జోరు 
వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ సవాల్‌
ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
సచివాలయంలోనూ అదే పరిస్థితి
హైదరాబాద్‌లోనూ చర్చోపచర్చలు
 
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై భారీ స్థాయిలో పందేలు సాగుతున్నాయి. గత వారం రోజులుగా సాగుతున్న బెట్టింగులు ఒక ఎత్తయితే బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలించిన తర్వాత నడుస్తున్న బెట్టింగులు మరో ఎత్తుగా మారాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై మంగళవారం వరకూ రూపాయికి రూపాయి దామాషాలో పందేలు సాగాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే మహిళలు, గ్రామీణులు పోలింగ్‌ కేంద్రాల ఎదుట బారులు తీరి ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం, గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత అధికంగా ఓట్లు పోల్‌ కావడంతో పందెపు రాయుళ్ల వ్యవహార సరళి మారిపోయింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోటెత్తిందని, దీనివల్ల వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీని బలపరిచేవారు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటింగ్‌ వల్లే పోలింగ్‌ పెరిగిందని టీడీపీ అనుకూలవాదులు విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్‌ శాతం పెరిగినప్పుడల్లా అధికార పక్షాలకు వ్యతిరేక తీర్పు వచ్చిందని, పైగా నంద్యాలలో జగన్‌ అనుకూల ఓటింగ్‌ జరిగినందున తమదే విజయమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమాతో అధిక మొత్తంలో పందేలకు దిగుతున్నాయి.
 
పోలింగ్‌ ఆరంభమైన తర్వాత టీడీపీ గెలుస్తుందని పందేలు కాయడానికి బెట్టింగురాయుళ్లు కొంత వెనుకంజ వేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున రూపాయికి రూపాయిన్నర (వైఎస్సార్‌సీపీ గెలిస్తే రూ. లక్ష ఇవ్వండి.. ఓడిపోతే మేం రూ.1.5లక్షన్నర ఇస్తాం) అంటూ ఆ పార్టీ అనుకూలవాదులు సవాల్‌ విసురుతున్నారు.

రాయలసీమతోపాటు గుంటూరు, కోస్తా జిల్లాల్లో భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. ‘‘వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి బుధవారం రూ. 15 లక్షలు పందెం కాశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా నంద్యాల ఎన్నిక ఫలితంపై తీవ్ర స్థాయిలో పందేలు సాగుతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారే కాకుండా తెలంగాణకు చెందినవారు కూడా చాలామంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారంటూ బుధవారం పందేలు కాశారు. టీడీపీ తరఫున పందేలకు వస్తున్న వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ కూకట్‌పల్లికి చెందిన ఒక పారిశ్రామికవేత్త  కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారితో రూ. 10 లక్షలు పందెం కాశారు. పోలింగ్‌ సరళిని సొంతంగా అంచనా వేయడంతోపాటు కచ్చితమైన విశ్లేషణ కోసం చాలామంది మీడియా ప్రతినిధులతోనూ, ఇతరత్రా వాకబు చేస్తున్నారు. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పందేలకు దిగుతున్నారు. పోలింగ్‌ తర్వాత వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పందేలు కాచే వారి సంఖ్య ఎక్కువైంది. అందుకే రూపాయికి రూపాయన్నర రేటు నడుస్తోంది..’’ అని ఈ వ్యవహారాల్లో తలపండిన ఒక  వ్యాపారి ’సాక్షి’కి తెలిపారు. 
 
అన్నిచోట్లా హాట్‌ టాపిక్‌...
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా ఎక్కడ నలుగురు కలిసినా నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది. అమరావతి సచివాలయంలోని ఉద్యోగులు కూడా ఉదయం నుంచి ఇదే చర్చలో మునిగిపోయారు. నంద్యాలలో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటూ వారు మీడియా ప్రతినిధులను, కర్నూలు జిల్లాలో ఉన్న తమ బంధువులు, మిత్రులు, ఉద్యోగులను సెల్‌ఫోన్‌లో వాకబు చేశారు. ఎక్కువమంది ఉద్యోగులు బుధవారం పోలింగ్‌ సరళిపై టీవీలు, సెల్‌ఫోన్లలో చూస్తూ కనిపించారు. టీవీల్లో ప్రసారాలు సరిగా రాకపోవడంతో విసుక్కున్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement