ఒత్తిడితో విలవిల | home guard dead with heart stroke | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో విలవిల

Feb 26 2018 12:52 PM | Updated on Feb 26 2018 12:52 PM

home guard dead with heart stroke - Sakshi

సదస్సు ప్రాంగణంలోనే ప్రాణాలు వదిలిన హోం గార్డు చేపల రాజు (ఇన్‌సెట్‌) రాజు (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం: విశ్రాంతి ఇవ్వకుండా మన చేత ఇలా డ్యూటీలు మీద డ్యూటీలు చేయిస్తున్నంత కాలం మనకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఒత్తిడి తట్టుకోలేక ఎవరో ఒకరూ ఇలాగే ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.

పోలీస్‌ వ్యవస్థ ఇంకెప్పుడు మారుతుందో?
ఆఫీసర్స్‌ అందరికి శతకోటి వందనాలు..
చావగొడుతున్నారు.. తిండి తిప్పల్లేవు.. కంటిమీద కునుకు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
పోలీస్, రెవెన్యూ సిబ్బంది తమ సహచర ఉద్యోగులకు పెడుతున్న మెసేజ్‌లు ఇవి.
ఎంత ఒత్తిడితో పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారో ఈ మెసేజ్‌లు చూస్తే అర్థమవుతోంది. ఏపీఐఐసీ ప్రాంగణంలో జరుగుతున్న మూడ్రోజుల భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ అధికారులు.. సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సదస్సు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న చేపల రాజు (39) అనే హోంగార్డు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. లక్ష్మిటాకీస్‌ దరి చిలకపేటకు చెందిన ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సన్యాసిరావు(పీసీ నెం.531) ఒత్తిడి తట్టుకోలేక ఫిట్స్‌ రావడంతో రక్తం కక్కుకుంటూ కూలబడిపోయాడు. అతడిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అతను కూడా గుండెపోటుకు గురైనట్టుగానే చెబుతున్నారు. పరిస్థితి విçషమంగా ఉందని కేజీహెచ్‌ వైద్యులు వెల్ల డించారు. ఈయన హెడ్‌ కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

వీరిద్దరే కాదు.. రెవెన్యూ శాఖలో కూడా ఓ డెప్యుటీ తహసీల్దార్‌తో సహా ముగ్గురు సిబ్బంది హైబీపీతో ఆస్పత్రి పాలైనట్టుగా తెలియవచ్చింది. గతంలో కూడా ఇదే రీతిలో పార్లమెంటరీ స్పీకర్స్‌ కాన్ఫరెన్స్‌ జరిగిన సమయంలో స్టీల్‌ ప్లాంట్‌ భూసేకరణ విభాగం స్పెషల్‌ డెప్యుటీ కలెక్టర్‌ నోవొటల్‌ వద్ద వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్న సమయంలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఓవైపు భూకబ్జాలు.. రికార్డుల టాంపరింగ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సిట్‌ సిఫార్సులు, కేసులు నివేదికలతో రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

మరో వైపు వరుసగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలతో క్షణం తీరికలేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. భాగస్వామ్య సదస్సు ప్రాంగణం వద్దే హోంగార్డు గుండెపోటుతో మరణించడం.. మరో కానిస్టేబుల్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా.. సీఎంతో సహా కేబినెట్‌ మొత్తం ఇక్కడే ఉన్నా వారిలో చలనం లేకపోవడం దురదృష్టకరం. కనీసం చనిపోయిన కానిస్టేబుల్‌ ఇంటికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ పరామర్శించేందుకు వెళ్లిన పాపానపోలేదు. దీంతో ఇంకెంతకాలం ఒత్తిడిలో పనిచేయాలంటూ పోలీస్, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా రేయింబవళ్లు భార్య, బిడ్డలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనీస గుర్తింపు కూడా లేదని వాపోతున్నారు.
సదస్సు ప్రాంగణంలోనే రక్తం కక్కుకుంటూ కుప్పకూలిన ఏఆర్‌ కానిస్టేబుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement