అమ్మ..హోమ్‌గార్డూ! | Home Guard Corruption In Prakasam | Sakshi
Sakshi News home page

అమ్మ..హోమ్‌గార్డూ!

Sep 5 2018 2:04 PM | Updated on Sep 5 2018 2:04 PM

Home Guard Corruption In Prakasam - Sakshi

హోమ్‌గార్డు ఆక్రమించి నిర్మించిన షాపులు

ప్రకాశం, చీరాల: ఈపూరుపాలెం పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ హోమ్‌గార్డు ఆ స్టేషన్లో చేస్తున్న హల్‌చల్‌ అంతా..ఇంతా..కాదు. రూరల్‌ పోలీసుస్టేషన్‌కు అధికారులు ఎవరు వచ్చినా మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాడు. వారి సొంత పనులు చేస్తూ పోలీసుస్టేషన్లలో చక్రం తిప్పుతుంటాడు. చివరకు పోలీసు క్వార్టర్స్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి షాపులు నిర్మించి అద్దెకు ఇస్తున్నాడంటే అతని హవా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా పోలీసు శాఖకు చెందిన హోమ్‌గార్డు స్థలాన్ని ఆక్రమించి షాపులు నిర్మించి అద్దెలు వసూలు చేసుకుంటున్నాడు. వివరాలు.. రూరల్‌ పోలీసుస్టేషన్లో చాలాకాలంగా హోమ్‌గార్డుగా తిష్ట వేసి వి«ధులు నిర్వహిస్తున్నాడు. ఏళ్ల తరబడి ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూ స్టేషన్‌ వ్యవహారాలు చూస్తుంటాడు. హోమ్‌గార్డు కన్ను పోలీసు క్వార్టర్స్‌కు ఎదురుగా ఉన్న విలువైన స్థలంపై పడింది. మొదట్లో చిన్నగుడిసె వేసి ఆక్రమించాడు. ఇక తనను ఎవరూ అడగరని నిర్ధారించుకున్నాడు.

ముందు వేసిన గుడిసెను తొలగించి ఈపూరుపాలెం–బాపట్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రూ.8 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అందులో రెండు దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసు శాఖలో పనిచేసే హోమ్‌గార్డు కావడం.. స్టేషన్లో పెత్తనం చేస్తున్న ఉద్యోగి కావడంతో స్థానికులు అడ్డు చెప్పలేకపోతున్నారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నా జంకుతున్నారు. కళ్లముందే లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమించి గదులు నిర్మించి అద్దెకిస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో చీరాల డీఎస్పీగా పనిచేసిన డాక్టర్‌ ప్రేమ్‌కాజల్‌కు ఈ వ్యవహారం తెలియడంతో హోమ్‌గార్డు ఆక్రమణలపై దష్టి సారించి ఆక్రమణలకు పాల్పడుతున్న హోమ్‌గార్డుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పుడు కొంతకాలం రేకుల షెడ్డును మూసివేసిన హోమ్‌గార్డు..ఇటీవల డీఎస్పీ బదిలీ కావడంతో మళ్లీ తనపంథాను యథావిధిగా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి హోమ్‌గార్డు చేసే అక్రమాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement