పదిలం | highesht ranks passed in Tenth exams than last year in kurnool district | Sakshi
Sakshi News home page

పదిలం

May 16 2014 2:07 AM | Updated on Sep 2 2017 7:23 AM

జిల్లాలోని విద్యార్థులు ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తూనే.. మరోవైపు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకున్నారు.

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: జిల్లాలోని విద్యార్థులు ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తూనే.. మరోవైపు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకున్నారు. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలకు సిద్ధమయ్యారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.
 
గత ఏడాది కంటే ఉత్తీర్ణతా శాతాన్ని పెంచారు. జిల్లాలో వంద రోజులకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. ఫలితంగా పాఠశాల పని దినాలు కోల్పోయినా.. ఉపాధ్యాయులు సెలవులను రద్దు చేసుకుని విద్యార్థుల భవిష్యత్తే పరమావధిగా కష్టపడ్డారు. మరోవైపు ఫలితాల శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఈవో కె. నాగేశ్వరరావు, డిప్యూటీ డీఈవో తీవ్రంగా శ్రమించారు. తరచూ ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అంతేగాక డాక్టర్ గమనం, డాక్టర్ బ్రహ్మారెడ్డి వంటి వ్యక్తిత్వ వికాస నిపుణులతో విద్యార్థుల్లో మానసికస్థైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. అందరి శ్రమ గురువారం నాటి ఎస్‌ఎస్‌సి పరీక్ష ఫలితాల్లో ప్రస్ఫుటమయ్యింది. జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది ఎన్నడూలేని విధంగా పది శాతం వృద్ధితో 91.55 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించగా, ఆ రికార్డును అధిగమిస్తూ ఈసారి 93.20 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు అదరగొట్టారు. ఫలితాల శాతంలో బాలబాలికలు పోటీపడ్డారు. కొద్దిపాటి తేడాతో బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ వరకు పరీక్షలు నిర్వహించారు.
 
 ఏప్రిల్ 15 నుంచే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా వస్తాయనుకున్న ఫలితాలు ముందే రావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ తగ్గింది. గురువారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత ఏడాది 7వ స్థానంలో ఉండగా ఈ సారి 5వ స్థానాన్ని దక్కించుకుంది. రాయలసీమ పరిధిలో కడప తర్వాత స్థానాన్ని కర్నూలు చేజిక్కించుకుంది.
 సమష్టి కృషితోనే మంచి ఫలితాలు
 -డీఈవో కె. నాగేశ్వరరావు
 
 జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఫలితాలు సాధించాం. ఉపాధ్యాయుల అంకితభావం మరువలేనిది. ప్రత్యేకంగా రాజీవ్ విద్యామిషన్ ఎస్‌పీడీ ఉషారాణి స్థానిక డిప్యూటీ డీఈవోలకు రెండు నెలల పాటు వాహనాలను సమకూర్చి పాఠశాలల పర్యవేక్షణకు కృషి చేశారు. ఆర్‌జేడీ సమీక్ష సమావేశాలు, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు పాఠశాలలను దత్తత తీసుకోవడం మరో కారణమైంది.
 
 ఈ విజయం సమష్టి కృషి ఫలితం. ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి, వారికి ప్రత్యేక తర్ఫీదునిప్పించాం. ఏడాది పొడవునా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మోడల్ టెస్ట్ పేపర్లతో పరీక్షలు, ప్రిపరేషన్ టెస్ట్‌లు, వారాంతపు పరీక్షలు, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దేలా చేశాం.
 
 జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
 పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నాం. ఈ విద్యార్థుల నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు వసూలు చేసి, వారు జూన్ 2వ తేదీన  చలానా చెల్లించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement