breaking news
sudhar shan reddy
-
పదిలం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: జిల్లాలోని విద్యార్థులు ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తూనే.. మరోవైపు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకున్నారు. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలకు సిద్ధమయ్యారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణతా శాతాన్ని పెంచారు. జిల్లాలో వంద రోజులకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. ఫలితంగా పాఠశాల పని దినాలు కోల్పోయినా.. ఉపాధ్యాయులు సెలవులను రద్దు చేసుకుని విద్యార్థుల భవిష్యత్తే పరమావధిగా కష్టపడ్డారు. మరోవైపు ఫలితాల శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఈవో కె. నాగేశ్వరరావు, డిప్యూటీ డీఈవో తీవ్రంగా శ్రమించారు. తరచూ ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అంతేగాక డాక్టర్ గమనం, డాక్టర్ బ్రహ్మారెడ్డి వంటి వ్యక్తిత్వ వికాస నిపుణులతో విద్యార్థుల్లో మానసికస్థైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. అందరి శ్రమ గురువారం నాటి ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ప్రస్ఫుటమయ్యింది. జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది ఎన్నడూలేని విధంగా పది శాతం వృద్ధితో 91.55 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించగా, ఆ రికార్డును అధిగమిస్తూ ఈసారి 93.20 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు అదరగొట్టారు. ఫలితాల శాతంలో బాలబాలికలు పోటీపడ్డారు. కొద్దిపాటి తేడాతో బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ వరకు పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా వస్తాయనుకున్న ఫలితాలు ముందే రావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ తగ్గింది. గురువారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత ఏడాది 7వ స్థానంలో ఉండగా ఈ సారి 5వ స్థానాన్ని దక్కించుకుంది. రాయలసీమ పరిధిలో కడప తర్వాత స్థానాన్ని కర్నూలు చేజిక్కించుకుంది. సమష్టి కృషితోనే మంచి ఫలితాలు -డీఈవో కె. నాగేశ్వరరావు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఫలితాలు సాధించాం. ఉపాధ్యాయుల అంకితభావం మరువలేనిది. ప్రత్యేకంగా రాజీవ్ విద్యామిషన్ ఎస్పీడీ ఉషారాణి స్థానిక డిప్యూటీ డీఈవోలకు రెండు నెలల పాటు వాహనాలను సమకూర్చి పాఠశాలల పర్యవేక్షణకు కృషి చేశారు. ఆర్జేడీ సమీక్ష సమావేశాలు, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు పాఠశాలలను దత్తత తీసుకోవడం మరో కారణమైంది. ఈ విజయం సమష్టి కృషి ఫలితం. ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి, వారికి ప్రత్యేక తర్ఫీదునిప్పించాం. ఏడాది పొడవునా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మోడల్ టెస్ట్ పేపర్లతో పరీక్షలు, ప్రిపరేషన్ టెస్ట్‌లు, వారాంతపు పరీక్షలు, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దేలా చేశాం. జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నాం. ఈ విద్యార్థుల నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు వసూలు చేసి, వారు జూన్ 2వ తేదీన చలానా చెల్లించాలి. -
ఏసీబీ వలలో.. మంథని హౌసింగ్ డీఈ
మంథని, న్యూస్‌లైన్ : ఇల్లు కట్టుకొమ్మని ముగ్గు పోసిన అధికారులే... మీ ఇల్లు పెద్దగా ఉంది బిల్లు ఇవ్వబోమంటూ తిరకాసు పెట్టారు. ఇల్లు కట్టుకున్నాం బిల్లు మంజూరు చేయమంటే వేధించారు. భరించలేని ఆ బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో ఆ లంచావతారి అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... ముత్తారం గ్రామానికి చెందిన గుడి వసంత పేరిట 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. 13 నెలల క్రితం హౌసింగ్ అధికారులే ముగ్గు పోసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింపజేశారు. నిర్మాణం పూర్తయి ఏడాది గడిచినా పైసా బిల్లు రాలేదు. ఇల్లు పెద్దగా ఉందంటూ తిరకాసు పెట్టారు. కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించలేదు. బిల్లు మొత్తం రూ.68 వేలు చెల్లించాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని మంథని హౌసింగ్ డీఈ వెంకటేశం డిమాండ్ చేశారు. మొదటిదశ బిల్లు రూ.17,500 మంజూరు కోసం రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వసంత భర్త కొండల్‌రెడ్డి... ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు గురువారం మంథనిలోని గృహ నిర్మాణశాఖ కార్యాలయంలో కొండల్‌రెడ్డి నుంచి డీఈ రూ.5 వేలు లంచం తీసుకుంటుండడగా డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఈని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందిరమ్మ బిల్లుల గురించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. హౌసింగ్ అధికారులు ముగ్గు పోసి చెప్పినట్లే ఇల్లు కట్టుకుంటే... ఇప్పుడు బాగా పెద్దగా ఉన్నదని అంటున్నరు. బిల్లు కోసం వర్క్ ఇన్స్పెక్టర్ను అడిగితే ఏఈని, ఆయన దగ్గరకు పోతే డీఈ దగ్గరకు వెళ్లాలని తిప్పించుకుంటున్నారు. డీఈని కలిస్తే ఈఈ దగ్గరకు వెళ్లాలంటున్నారు. మూడో విడత రచ్చబండలో ఈఈని కలిసి చెప్పగా డీఈనే బిల్లు ఇస్తాడని చెప్పాడు. దీంతో మళ్లీ డీఈ దగ్గరకు పోగా... ఇల్లు పెద్దగా ఉందని, బిల్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిండ్రు. 15 రోజులు ఆగి మళ్లీ వెళ్తే 15 వడ్ల బస్తాలు అడిగిండ్రు. అంత ఇచ్చుకోలేనంటే బిల్లుల్లో పిఫ్టీ పిఫ్టీ ఇవ్వమన్నరు. 15 వేలకు బేరం కుదుర్చుకుని మొదటి బిల్లు మంజూరుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నా. కష్టపడి కట్టుకున్న ఇల్లుకు ఇంత ఇబ్బంది పెట్టే అధికారులను ఎందుకు విడిచిపెట్టాలని, ఏసీబోళ్లనుకలిసా... - గుడి కొండాల్‌రెడ్డి, బాధితుడు, ముత్తారం సాంకేతిక లోపం ఆన్లైన్లో సాంకేతిక లోపం వల్లే బిల్లు రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత బిల్లును ఆన్లైన్లో పెట్టా. లబ్ధిదారును ఏనాడు ఒక్కపైసా డిమాండ్ చేయలేదు. అకస్మాత్తుగా వచ్చి తన ముందు డబ్బులు పెట్టిండు. నేను ఏ పాపం ఎరుగను. - వెంకటేశం, డీఈ, మంథని ఇదే మొదటిసారి కాదు... మంథని : లంచం తీసుకుంటూ పట్టుబడిన హౌసింగ్ డీఈ వెంకటేశంది అవినీతిలో అందెవేసిన చెయ్యే. మంథని డీఈగా సుదీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న ఈయన లబ్ధిదారుల సొమ్ము దిగమింగిన సందర్భాలు అనేకం. మల్హర్ మండలం నాచారం, అన్సాన్పల్లిలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల బిల్లుల చెల్లింపులో రూ.2 లక్షలకు పైగా కాజేసిన కేసులో డీఈ వెంకటేశంతోపాటు అప్పటి ఏఈ లింగమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌పై కేసు నమోదైంది. మల్హర్ మండలం అన్సాన్పల్లికి చెందిన భూక్యా రఘు అనే లబ్ధిదారుకు చెందిన రూ.64 వేలు కాజేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క గ్రామంలో 20 మంది లబ్ధిదారుల బిల్లులను డీఈ కిందిస్థాయి అధికారులతో కలిసి కాజేశారనే ఆరోపణలున్నాయి. ఆయనను అప్పుడే విధుల నుంచి తప్పించి మరోచోటికి బదిలీ చేయాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇష్టమొచ్చినట్లుగా వసూళ్లకు పాల్పడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.