అసెంబ్లీలో హైడ్రామా | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో హైడ్రామా

Published Mon, Jan 27 2014 11:23 PM

hi drama in assembly !

 టీ బిల్లును అడ్డుకునేందుకు కుట్రలు
 సీఎం తీరు రాజ్యాంగ విరుద్ధం
 సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 తెలంగాణ రాష్ట్ర బిల్లుపై శాసనసభలో హైడ్రామా నడుస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుకు సీల్డ్ కవర్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. 40 రోజులకు పైగా చర్చ జరిగిన తరువాత ఇప్పుడు బిల్లును తిప్పి పంపాలని సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు. బిల్లును తిరస్కరించాలని సీఎం స్పీకర్‌కు లేఖ ఇవ్వడం తన హద్దు మీరి ప్రవర్తించడమేనన్నారు. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనైనా మనసున్నది మాత్రం ఆంధ్రాపైనేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, సాంకేతిక అంశాల పేరుతో వ్యతిరేకించడం సరైన చర్య కాదన్నారు.
 
  దేశమంతా ఎన్నికల వాతావరణం నెలకొంటే ఇక్కడ మాత్రం గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితిని తొలగించి. పార్లమెంటులో బిల్లును ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయని, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సెక్యులరిజం ప్రధాన పాత్ర పోషించాలని, దీనికి వామపక్షాలు ఒక వేదిక మీదికి వచ్చి మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ప్రకాశ్‌రావు, నర్సాపూర్ ఇన్‌చార్జి చినుముల కిషన్‌రెడ్డి, జిల్లా నాయకులు తాజుద్దిన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందపవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement