ఇచ్చోటనే!.

ఇచ్చోటనే!. - Sakshi


సాక్షి, గుంటూరు:

 రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో పేకాట స్థావరాలు కలకలంరేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు జిల్లాలో యథేచ్ఛగా సాగిన పేకాట క్లబ్‌లు ఆ తరువాత మూతపడ్డాయి. ఇదే అదనుగా రాజకీయ అండదండలు, పోలీసు అధికారులతో సత్సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు పేకాట కేంద్రాలను నడపడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.  ముఖ్యంగా గుంటూరు- విజయవాడ మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్, మంగళగిరి,  మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్, మంగళగిరి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని అందులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి స్థావరాలు మారుస్తూ భారీ ఎత్తున పేకాట నడుపుతున్నారు.

     జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి మండలం కాజ గ్రామ సమీపంలో ఉన్న ఐజేఎం విల్లాస్‌లో మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి రూ. 63 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్టు చేయడం రాష్ట్ర చరిత్రలోనే  సంచలనం కలిగించింది.

     విజయవాడ కేంద్రంగా కొత్త రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గుంటూరు - విజయవాడ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న రియల్టర్లు కొందరు ఇక్కడ పేకాట ఆడడం మామూలైంది.

 జిల్లాలోని పేకాట స్థావరాలకు గుంటూరుతోపాటు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాల నుంచి వందల సంఖ్యలో జూదరులు వస్తున్నారు. అధిక శాతం మంది రాజకీయ నేతలు, రియల్టర్‌లు, వ్యాపారస్తులు ఖరీదైన కార్లలో వస్తుండటంతో రూ.కోట్లలో పేకాట నడుస్తోంది.

     పోలీసు అధికారులు పేకాట నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

     జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్న పోలీసులు చిన్న చిన్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు.

 క్లబ్‌లపై పలుమార్లు దాడులు..

     గతంలో జిల్లాలో రిక్రియేషన్ క్లబ్ పేరిట అనుమతులు తీసుకుని కొందరు పెద్దలు అనధికారికంగా పేకాట నిర్వహించేవారు. తాడేపల్లి మండలం పాతూరు కట్టపై వున్న విజయవాడ క్లబ్‌లో పేకాట నిర్వహిస్తుండగా పలుమార్లు పోలీసులు దాడులు చేసిన సంఘటనలు వు న్నాయి.

     మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్‌పై  రెండేళ్ల క్రితం  పోలీసులు దాడులు నిర్వహించి సుమారు 450 మందికి పైగా జూదరులను అరెస్ట్ చేసిన సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

     చిలకలూరిపేట సమీపంలో ఓ క్లబ్‌లో పేకాట పెద్ద ఎత్తున నడుస్తున్నప్పటికీ అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోలేదు.

 ఎంపీ స్టిక్కర్ కలిగిన కారుతో హల్‌చల్..

     కాజ గ్రామ పరిధిలోని ఐజేఎం విల్లాస్‌లోని జూద స్థావరంపై మంగళవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన వారంతా  రియల్ ఎస్టేట్ వ్యాపారులని గుర్తించారు.  ఇందులో అధికార పార్టీకి చెందిన నేతల బంధువర్గం సైతం వుండటంతో పోలీసుల మీద ఒత్తిడి ఎక్కువైంది. దీంతో నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేశారు.

     ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న 11 కార్లలో ఓ ఇన్నోవా కారుపై అధికారపార్టీ రాజ్యసభకు చెందిన ఎంపీ స్టిక్కర్ వుండటంతో పలు అనుమా నాలు తలెత్తుతున్నాయి. ఎంపీ స్టిక్కర్‌తో వున్న ఈ కారును ఎవరైనా వినియోగిస్తున్నారా? లేక ఎంపీకి చెందిన సన్నిహితులు ఎవరైనా పేకాట ఆడుతున్నారా? అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజిస్ట్రేషన్ మాత్రం గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన సయ్యద్ సుభానీ పేరుతో వుంది.

     ఇక్కడ పోలీసులకు చిక్కిన వారిలో అధికార పార్టీకి చెందిన ప్రకాశం జిల్లాలోని ఓ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఒకరు వున్నట్లు తెలిసింది. ఇతను కొంతకాలం నుంచి పేకాట ఆడుతూ రూ.17 కోట్లు పోగొట్టుకున్నట్లు సమా చారం.

     పోలీసుల దాడుల అనంతరం కొందరు పెద్దలను తప్పించి వారి స్థానంలో డ్రైవర్లపై కేసులు నమోదు చేశారనే ఆరోపణలూ వినవస్తున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top