గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలి

Help Desk For Gulf Victims - Sakshi

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం : గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని స్వగ్రామాలకు తీసుకురావాలని పలువురు బాధిత కుటుంబాలకు చెందిన వారు బుధవారం పట్టణంలో జరిగిన గల్ఫ్‌హెల్ఫ్‌ కార్యక్రమంలో కైండ్‌నెస్‌ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రాలు సమర్పించారు. ఆకివీడు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎం.మరియమ్మ జీవనోపాధి నిమిత్తం పది నెలల క్రితం దుబాయ్‌ వెళ్లగా అక్కడ ఆమెను శారీరకంగా, మానసికంగాను ఇబ్బందులు పెడుతున్నారని, మరియమ్మను స్వగ్రామానికి రప్పించాలని తల్లి జి.రూతమ్మ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు.

పెంటపాడు మండలం బీసీ కాలనీకి చెందిన చిటికిన వెంకట సత్యవరప్రసాద్‌ ఏడాది క్రితం జీవనోపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లగా అక్కడ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడని, అతడిని స్వదేశం రప్పించాలని తల్లి చిటికి వెంకట నరసమ్మ వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామానికి చెందిన కలిశెట్టి సుబ్రహ్మణ్యం జీవనోపాధి నిమిత్తం ఖతర్‌ వెళ్లగా అక్కడ యజమాని పాస్‌పోర్టు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని స్వదేశం తీసుకురావాలని అన్న కలిశెట్టి వెంకట చలపతి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా ఏజెంట్ల మాయమాటలు నమ్మడం, ఎక్కువ జీతం వస్తుందని భావించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు ఆధారంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలని, అలా వెళ్లిన వారు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా పాలసీ పొందవచ్చని చెప్పారు. సాయిశ్రీ, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top