
రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షం
రాష్ర్టంలో సోమవారం పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం, సాయంత్రం వేళల్లో జడివాన కురిసింది.
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ర్టంలో సోమవారం పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం, సాయంత్రం వేళల్లో జడివాన కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు పోటెత్తడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పురాతన భవనాల్లో నివసిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుంటూరు శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చే రడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. వన్‌టౌన్, టూటౌన్, పటమట ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నందిగామ, ఇబ్రహీంపట్నం, గన్నవరంలలో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహించింది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో భారీ వర్షం కురిసింది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆంధ్రా తీరాన్ని ఆనుకుని ఒడిశాకు మధ్యలో 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా ఆవరించింది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లులు గానీ, ఉరుములతో కూడిన వర్షం గానీ పడే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి కారణంగా సోమవారం సాయంత్రం వరకు ఏపీలోని మూడు డివిజన్ల పరిధిలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయన్నారు. గన్నవరంలో 6 సెం.మీ, బాపట్లలో 3, ఒంగోలులో ఒక సెం.మీ. వర్షం పడిందన్నారు.