ఇటీవల కురిసిన భారీ వర్షాలు ‘ఆలు’ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. విత్తనం భూమిలోనే కుళ్లిపోవడంతో పంట మొలకెత్తలేదు.
జహీరాబాద్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ‘ఆలు’ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. విత్తనం భూమిలోనే కుళ్లిపోవడంతో పంట మొలకెత్తలేదు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో రైతులు భారీ విస్తీర్ణంలో ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్నారు. వర్షాల కంటే ముందు సాగు చేసుకున్న ఆలుగడ్డ పంట భూమిలోనే కుళ్లి పోయింది. సుమారు వేయి ఎకరాలకు పైగా ఆలుగడ్డ పంట కుళ్లిపోయినట్లు అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలును సాగు చేస్తున్న రైతులు ఈ సారి నష్టపోయారు. వేసిన పంట మొలకెత్తకుండానే పొలాల్లో కుళ్లి పోవడంతో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ చర్యలే తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంటనష్టంపై సర్వే చేయకపోవడం దారుణంగా ఉందంటున్నారు.
పెట్టుబడులు పూర్తిగా నేలపాలు
ఆలు పంటసాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నేల పాలయ్యాయి. ఎకరా పొలంలో పంట సాగు కోసం విత్తనంపై రూ.15 వేలు, ఎరువుల కోసం రూ.5 వేలు, భూమి చదును కోసం రూ.5 వేలు, సాగు కోసం రూ.5 వేలు ఇలా ఎకరాకు రూ.30 వేలు ఆలు రైతులు పెట్టుబడులు పెట్టారు. అయితే అధిక వర్షాలతో విత్తనం కుళ్లిపోవడంతో మొలకలు రాలేదు. దీంతో పెట్టుబడి అంతా వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం అధిక వడ్డీలపై అప్పులు చేశామనీ, పంట విత్తనం దశలోనే దెబ్బతినడంతో ఆశలు వదులుకున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే తప్ప, తాము అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం లేదన్నారు
నిల్వ చేసిన చోటే కుళ్లిపోయింది
పంట సాగు కోసం రైతులు ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని ఆగ్రా ప్రాంతం నుంచి ఆలు విత్తనాన్ని కొనుగోలు చేశారు. విత్తనం డబ్బును పంటపై చెల్లించేందుకు వ్యాపారులతో వారు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎడతెరిపిలేని వర్షాలతో ఆలు విత్తనం నిల్వ ఉంచిన చోటే కుళ్లిపోయింది. దీంతో విత్తనం డబ్బును వ్యాపారులకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.