మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
♦ వేలాది హెక్టార్లలో రాలిన మామిడి
♦ నీట మునిగిన వరి, టమాట, వేరుశెనగ పంటలు
♦ నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు
♦ జిల్లావ్యాప్తంగా కోట్లలో నష్టం
♦ పూర్తిస్థాయిలో పర్యటించని అధికారులు
♦ నష్టం ప్రాథమిక అంచనా సైతం లేని వైనం
జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్నఅకాల వర్షాలు కర్షకులకు కష్టాల్ని మిగిల్చాయి. వేలాది హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి, టమాట, బొప్పాయి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒబ్బిళ్లు చేసి పొలంలో ఉంచిన వేరుశెనగ పాదుల్లో నీళ్లు నిలిచిపోయాయి. గాలులతో కూడిన వర్షానికి పక్వదశకు చేరుకుంటున్న మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సాక్షి, చిత్తూరు : మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బుధవారం సైతం జిల్లాలో 59 మండలాల్లో వర్షం కురవగా, తంబళ్ల పల్లె నియోజకవర్గం పెద్దమండ్యంలో 88.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తంబళ్లపల్లెలో 40.2 మిల్లిమీటర్లు, కురబలకోటలో 45.6, గుర్రంకొండలో 31 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఒకటి, రెండు నియోజకవర్గాలలో ఈదురు గాలులు లేకుండా కురిసిన వర్షం వల్ల కొంతమేలు జరగ్గా, మిగిలిన నియోజకవర్గాల్లో అపారనష్టం వాటిల్లింది.
జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయలు నష్టం జరిగినా క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదు. ఒకరిద్దరు జిల్లా అధికారులు మినహా ఎవరూ గ్రామాలను తొం గి చూడలేదు. కనీసం ఎంతనష్టం జరిగిందన్న దాని పై కూడా అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం లే దు. పంట నష్టం వివరాలు అడిగితే, ఇంకా రాలేదం టూ తప్పించుకుంటున్నారు. గ్రామాల్లో విచారిస్తే, ఏ ఒక్క అధికారి రాలేదని రైతులు చెబుతున్నారు.
► పుంగనూరులో అత్యధిక వర్షంతో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. 165 ఎకరాల్లో టమాటా,135 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మిరప, కీరకాయ, కాలీఫ్లవర్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పది ట్రాన్స్‌ఫార్ల్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. సుమారు * 5 కోట్ల పైనే నష్టం వాటిల్లినట్లు అంచనా.
► పూతలపట్టు నియోజకవర్గంలో భారీవర్షం కురిసింది. పిడుగుపాటుతో తలపులపల్లెలో రెండు ఆవులు మృతి చెందాయి. మామిడి పంట పిందె రాలిపోయింది.
► సత్యవేడు నియోజకవర్గంలో బుధవారం సైతం భారీవర్షం కరిసింది. 1,200 ఎకరాల్లో కోతదశలో ఉన్న నువ్వుల పంట, మూడు వేల ఎకరాలకు పైగా వేరుశనగ, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుధవారం ఉదయం విద్యుత్ వైర్లు తెగి పది బర్రెలు మృతి చెందాయి.
► శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోనూ అన్నదాతలు నష్టపోయారు. తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో మామిడి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. వర్షంతో ఇటుక బట్టీలు పూర్తిగా తడిసి పోయి * కోటి పైనే నష్టం వాటిల్లింది.
► మదనపల్లె నియోజకవర్గంలో రామసముద్రం మండలంలో అపారనష్టం వాటిల్లింది. గాలీవానకు బొప్పాయి, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. రూ.3 కోట్ల పైగానే నష్టం వాటిల్లినట్లు అంచనా.
► పలమనేరు నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. బెరైడ్డిపల్లెలో ఎక్కువ నష్టం జరిగింది. కోత దశలో ఉన్న 150 హెక్టార్ల వరి పంట దెబ్బతింది. మామిడి, టమాట, కాకర, బీర పంటలకు నష్టం వాటిల్లింది.
► తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో 20 ఎకరాల టమాట, ములకలచెరువులో అరటిపంట దెబ్బతినింది. రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. నీటి ఎద్దడి నెలకున్న నేపథ్యంలో వర్షం కురవడంతో మేలు జరిగిందని కొన్ని ప్రాంతాల రైతులు పేర్కొంటున్నారు.
► చంద్రగిరి నియోజకవర్గంలో గాలీవానకు మామి డి, వేరుశెనగ పంటలకు నష్టం వాటిల్లింది.