
రాజుపాళెంలో భారీ అగ్ని ప్రమాదం
మండలంలోని రాజుపాళెం గిరిజన కాలనీ సమీపంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది
గడ్డివాములు,తాటి తోపులు, పూరిల్లు దగ్ధం
భయంతో పరుగులు తీసిన ప్రజలు
రాజుపాళెం(కలువాయి) : మండలంలోని రాజుపాళెం గిరిజన కాలనీ సమీపంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక మహిళ తన తోటలోని చెత్తను తగులబెట్టడంతో గాలులకు తోట కట్టవకు నిప్పంటుకుంది. దీంతో సుమారు 500 మీటర్ల మేర తాటితోపులు అగ్నికి ఆహుతయ్యాయి. మామిడి తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తోటలకు ఆనుకునే ఉన్న గిరిజన కాలనీలో మల్లికార్జున పూరిల్లు కాలి బూడిదైంది. ఇంటిలోని ఆరు సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 10 వేలు నగదు సహా సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిలిగారు. రోడ్డుకు మరో వైపున ఉన్న గుర్నాధం రాజు ఇంటి వద్ద ఐదెకరాల గడ్డివాములు తగలబడ్డాయి.
మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో కాలనీలోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. సాయంత్రం వరకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. పొదలకూరు నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రం మంటలను అదుపు చేసింది.
అధికారుల పరామర్శ
అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, తహశీల్దార్ హమీద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృత్యుంజయులు..ఈ చిన్నారులు
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లికార్జున, నిర్మల దంపతులకు ప్రసాద్(4), మరో ఏడాది బిడ్డ సంతానం. పసిబిడ్డ ఉయ్యాలలో, ప్రసాద్ ఇంటిలో ఆడుకుంటూ ఉన్నారు. కాలనీ నుంచి వీరి ఇంటికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో మల్లికార్జున గ్రామంలో లేరు. ఇంటి బయట ఉన్న నిర్మల పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పసిబిడ్డలను బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఇల్లు కూలిపోయింది. దీంతో చిన్నారులు మృత్యుంజయులుగా బయటపడ్డారు.