అమ్మా...గుండెనొప్పి...!

Heart Strokes in Middle Ages And Young People - Sakshi

పెరుగుతున్న గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు

చిన్న వయస్సులోనే గురవుతున్న వైనం

ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యుల సూచన 

 మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫలితంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అప్రమత్తమయ్యేలోపే చాలా వరకు ప్రాణాలు పోతున్నాయి.

విజయనగరం ఫోర్ట్‌: గతంలో 50, 60 ఏళ్లు దాటిని వారు గుండె నొప్పి బారిన పడేవారు. ఇప్పుడు 40 ఏళ్లు, 50 ఏళ్లులోపు వారు కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారు.  గతంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు.  ఇప్పుడు పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ ఫుడ్స్‌కు అలవాటు పడ్డారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు బారిన పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 10 శాతం మంది వరకు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా చేసే లిపిడ్‌ ప్రోఫైల్‌  పరీక్షల్లో 35 శాతం మందికి ట్రైగిజరైడ్స్‌ ఎక్కువుగా ఉన్నాయని, ఇవి గుండెకు అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరే గాక  వంశపారంపర్యం, జన్యు లోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండె జబ్బులతో జన్మించే పిల్లలు ఇటీవల ఎక్కువ అయ్యారు.  గుండె చేతి పట్టుకుని ప్రభుత్వ,  ప్రైవేటు ఆస్పత్రులకి ఇటీవల కాలంలో  40 ఏళ్లు లోపు వారే అధికంగా వస్తున్నారు. జిల్లాలో నెలకు పది వేల మంది వరకు ఈసీజీలు, వెయ్యి మందికి పైగా 2డీ ఎకో పరీక్షలు, 100 మంది వరకు యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేస్తున్నారు.

గుండె నొప్పి లక్షణాలు...
గుండె పోటు లక్షణాలు వచ్చినప్పుడు ఛాతిలో  నొప్పి  విపరీతంగా కలిగి మెలి పెట్టినట్టు ఉంటుంది. ఈ సమయంలో విపరీతమైన చెమట పడుతుంది. వాంతి వచ్చే భావన ఉంటుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లు, చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండె పోటు సూచనగా భావించాలి. చాతిలో నొప్పి వచ్చి అది ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా విపరీతంగా  చెమటలు  పడుతూ ఇబ్బంది పడుతున్నా  గుండె పోటుగా అనుమానించాలి. కింద దవడ నుంచి  బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా అనుమానంతో వైద్యులను సంప్రదించడం మంచిది. విపరీతంగా అలసిపోవడం  ఒళ్లంతా నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు  తరుచు కనిపిస్తున్నా వాటిని అశ్రద్ధ చేయకూడదు.

గుండెను ఇలా కాపాడుకుందాం...
పిల్లలకు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. పాఠశాలల్లో తప్పనిసరిగా యోగాను ప్రవేశ పెట్టి అమలు చేయాలి. ప్రతీ ఒక్కరికి వ్యాయామంపై అవగాహన పెంచాలి. చికెన్‌ లెగ్స్, అధిక  కొలెస్ట్రాల్‌ ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. పాఠశాలలు, కళాశాలలు వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేయకూడదు. బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేందుకు  ప్రయత్నించాలి.  ఇందుకోసం ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలి. మనసు ప్రశాంతంగా ఉంచేందుకు  ప్రకృతితో మమేకం కావాలి. తగినంత నిద్రపోవాలి. ఇది గుండెకు అదనపు శక్తినిస్తుంది. లిఫ్టులో వెళ్లే కంటే మెట్లు ఎక్కడం మంచిది.

రక్తం చిక్కబడితే ప్రమాదం..
ఇటీవల కాలంలో గుండె పోటు కేసుల్లో ఎక్కువుగా 40 ఏళ్లు లోపు వారు 15 శాతం మంది వరకు ఉంటున్నారు. ధూమపానం, కోకైన్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం లేక పోవడం,  విపరీతమైన మానసిక ఒత్తిడి  వంటి కారణాలతో  యువకుల్లో గుండె పోటు వస్తుంది. రక్తం చిక్కగా ఉండడం వల్ల సడన్‌గా గుండె పోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్‌ ప్రకాష్‌ చంద్‌ రాణా,కార్డియాలజిస్టు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top