జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, చిన్నారులకు నూరు శాతం పోలియో చుక్కలు అందించినట్టు
పల్స్ పోలియో విజయవంతం
Jan 21 2014 11:55 PM | Updated on Aug 24 2018 2:33 PM
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, చిన్నారులకు నూరు శాతం పోలియో చుక్కలు అందించినట్టు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్, జిల్లా నోడల్ అధికారి లోక్‌నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలియో, ఆస్పత్రుల అభివృద్ధి వైద్యులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌నాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తాను మూడు రోజులుగా విస్తృతంగా పర్యటించి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించానన్నారు. జిల్లాలోని 4.26 లక్షల మందికి పైగా ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు అందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2563 పల్స్‌పోలియో కేంద్రాలతో పాటు వంద మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివారం 95 శాతం పోలియో చుక్కలు పూర్తి చేశామని, సోమ, మంగళవారాల్లో మిగతా శాతాన్ని ఇంటింటికి తిరిగి పూర్తిచేశామన్నారు. ఇందుకు 10,900 మంది సిబ్బందిని వినియోగించుకున్నామన్నారు. గుంటూరు నగరంలో బుధవారం కూడా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి నిర్వహిస్తామన్నారు.
గుంటూరు నగరంలో నేడు కూడా పల్స్‌పోలియో...
కార్పొరేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు మరొక రోజు అదనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ వైద్యశాలల అభివృద్ధితో పాటు ఆయా వైద్యశాలలో సేవల వినియోగంపై మాచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల క్లస్టర్ ఏరియా అధికారి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఈఎస్‌ఐ వైద్యుడు కె.రామకోటయ్యలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement