బినామీ భాగోతం! | Happened to the trick! | Sakshi
Sakshi News home page

బినామీ భాగోతం!

Jan 18 2014 4:16 AM | Updated on Sep 5 2018 2:12 PM

పెన్షన్.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా ఇచ్చే సంక్షేమ పథకం. ఏ ఆధారం లేనివారికి అందాల్సిన ఈ సొమ్మును కొందరు ప్రబుద్ధులు స్వాహా చేస్తున్నారు.

పెన్షన్.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా ఇచ్చే సంక్షేమ పథకం. ఏ ఆధారం లేనివారికి అందాల్సిన ఈ సొమ్మును కొందరు ప్రబుద్ధులు స్వాహా చేస్తున్నారు. మరణించిన వారు, గ్రామంలో నివసించని వారు, అసలు గ్రామానికి చెందినవారే కాని లబ్ధిదారుల పేరిట వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో పెన్షన్లు పంపిణీ అయిపోతున్నాయి. బినామీల వేలిముద్రలతోనే అక్విటెన్స్ రికార్డులు తయారవుతున్నాయి. చూడటానికి చిన్న మొత్తాలే అయినా ఏళ్ల తరబడి చిలక్కొట్టుడు సాగిస్తూ సర్కారు ఖజానాకు భారీ చిల్లు పెడుతున్నారు. అదే సమయంలో అర్హులైన కొత్తవారి అవకాశాలకు గండి కొడుతున్నారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్న చాలా గ్రామాలకు శ్రీహరిపురం ఒక కేస్ స్టడీ లాంటిది. అక్కడ జరుగుతున్న తతంగం ఎలా ఉందో చూద్దాం పదండి..
 
 శ్రీహరిపురం(వంగర), న్యూస్‌లైన్: వంగర మండలం శ్రీహరిపురంలో 108 వృద్ధాప్య, 49 వితంతు, 10 వికలాంగ, 15 అభయహస్తం.. మొత్తం 182 మందికి పెన్షన్లు అందుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఏళ్ల తరబడి బినామీలకు చేరుతున్నాయి. లబ్ధిదారుల పేరుతోనే.. ఒకే రకమైన వేలిముద్రలతో వేరే వ్యక్తులు వీటిని కాజేస్తున్నారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో పెన్షన్లు బట్వాడా బాధ్యతను బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన  కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్(సీఎస్పీ)లు నిర్వర్తించారు. మధ్యలో కొన్ని నెలలు పంచాయతీ కార్యదర్శులకు ఆ బాధ్యత అప్పగించినా, ఇప్పుడు మాత్రం పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
 
 ఈ మార్పుతోనే బోగస్ లబ్ధిదారుల గుట్టు రట్టయ్యింది. ఇటువంటి వారిని గుర్తించిన పోస్టుమాస్టర్ పెన్షన్ ఇచ్చేందుకు తిరస్కరించారు. వాస్తవానికి స్మార్ట్‌కార్డుల ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేయాలనే నిబంధన ఉంది. అయితే గ్రామంలో ఆ విధానం అమలు కావడంలేదు. ఇదే అవకాశంగా బోగస్ లబ్ధిదారులు, గ్రామంతో సంబంధం లేనివారు దొడ్డిదారిన పెన్షన్లు పొందుతూ వచ్చారు. రాజకీయ నాయకుల అండతో సీఎస్పీ కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది. గ్రామంలో లేనివారు, మరణించిన పేర్లతో 30 మందికి పైగా ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నట్లు తెలిసింది.
 
 పెన్షన్ల జాబితాలో అక్రమాలు
 అన్ని రకాల పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయి. గ్రామంలో లేని వారికి అందిస్తున్నట్లు జాబితాల్లో రాసుకొని నిధులు కైంకర్యం చేస్తున్నారు. ఎప్పుడో చనిపోయిన వారి పేర్లతో తీసుకుంటున్నారు. సోషల్ ఆడిట్ బృందానికి, సామాజిక ప్రజావేదికలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
 -గుడివాడ రామారావుదొర, సర్పంచ్
 
 నిజమైతే బాధ్యులపై చర్యలు
 పెన్షన్ల పంపిణీలో అవకతవకలపై గ్రామంలో దర్యాప్తు చేస్తాం. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామంలో లేనివారికి, గ్రామం కానివారికి, మరణించిన వారి పేర్లతో పెన్షన్లు తీసుకోవడం నేరం.
 -డి.రామ్మోహనరావు, ఎంపీడీవో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement