హైకోర్టు సీజే తీరుపై విచారణకు ఆదేశించండి

Hansraj letter to the President and CJI and Union Justice Minister - Sakshi

కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

ఫలితంగానే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ చనిపోయారు

ఉద్యోగులకు కరోనా సోకింది

రాష్ట్రపతి, సీజేఐ, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ లేఖ

సాక్షి, అమరావతి: హైకోర్టులో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీం న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాశారు. జస్టిస్‌ మహేశ్వరి నిర్లక్ష్య చర్యలు, నిర్ణయాల వల్ల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని హన్స్‌రాజ్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, కక్షిదారుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రమాదరహితంగా హైకోర్టు, కింది కోర్టుల కార్యకలాపాలు సాగేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖ రాశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. 

కిక్కిరిసిన హాలులో ప్రమాణ స్వీకారాలు.. 
‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడంలో హైకోర్టు సీజే అసమర్థంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో న్యాయమూర్తులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మే 8న హైకోర్టులో మూసిఉన్న చిన్న ఎయిర్‌ కండీషన్డ్‌ హాలులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హాలంతా న్యాయమూర్తులు, క్లర్కులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, వీఐపీలతో కిక్కిరిసింది. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏర్పాట్ల నిమిత్తం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ తెల్లవారుజాము 3గంటల వరకు పనిచేశారు.   

రాజశేఖర్‌పై సీజే చెప్పలేనంత ఒత్తిడి మోపారు 
ఇటీవల చనిపోయిన బి.రాజశేఖర్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అనారోగ్యం పాలైనా బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారు.  ఆయన గుండె జబ్బు బాధితుడు. జస్టిస్‌ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడిని మోపుతున్నారంటూ రాజశేఖర్‌ తన సన్నిహితులకు, కుటుంబానికి చెబుతూ వచ్చారు. రాజశేఖర్‌ 24.6.2020 మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైకోర్టులో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.  రాజశేఖర్‌ను రోజూ కలుస్తూ వచ్చిన సీజే ఈ రోజుకీ కోవిడ్‌ పరీక్ష చేయించుకోలేదు. 

రిజర్వేషన్లను దూరం చేసేలా డ్రాఫ్ట్‌ రూల్స్‌...
జిల్లా జడ్జిల స్థాయిలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ న్యాయాధికారుల రిజర్వేషన్లను దూరం చేసే విధంగా డ్రాఫ్ట్‌ రూల్స్‌ సిద్ధం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తిరిగి అవే పోస్టుల్లో నియమించారు. కాబట్టి అంతర్గత విచారణకు ఆదేశించాలి. 

నివాస భవనం కేటాయించినా.. 
జస్టిస్‌ జేకే మహేశ్వరికి విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మూడు సూట్‌లను కేటాయించారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం కోసం ఓ అధికారిక భవనాన్ని కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరిలో సీజే అందులోకి వెళ్లినా ప్రభుత్వ అతిథి గృహంలోని మూడు సూట్‌లను ఇప్పటివరకు ఖాళీ చేయలేదు. ఇది రాష్ట్రానికి వచ్చే వీఐపీలకు ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి అంతర్గత విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top