లీటర్‌ పెట్రోలు లూజులో రూ.150

Grocery Prices Rise After Cyclone In Srikakulam - Sakshi

వంట గ్యాస్‌ ధర రెట్టింపు..

తుపాను బాధిత గ్రామాల్లో మండుతున్న ధరలు

(ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా రూ.5 ఉన్న కోడిగుడ్డు రూ.10 పలుకుతోంది. 25 లీటర్ల మంచినీరు క్యాన్‌ రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. కిలో టమాటాలను రూ.40 నుంచి 50 వరకూ అమ్ముతున్నారు. కూరగాయల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయని.. దీంతో పచ్చడితో సరిపెట్టుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. (పచ్చటి బతుకుల్లో తిత్లీ చిచ్చు)

లూజులో పెట్రోలును లీటర్‌ రూ.150కి అమ్ముతున్నారని.. వంటగ్యాస్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ‘ధరలు చూస్తే.. కొట్టోడు బతకాలి.. కొనేవాడు చావాలి’ అనే చందంగా ఉంది’ అని వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు చెప్పారు. కాగా.. నాలుగో రోజు ఆదివారం కూడా 1300 పైగా గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కాలేదు. దీంతో వేలాడుతున్న కరెంటు తీగలపై గ్రామస్తులు దుస్తులు ఆరేశారు.

పచ్చిబొప్పాయి కూర చేసుకుంటున్నాం
కూరగాయల ధరలు మండిపోతుండడంతో తోటలో పడిపోయిన చెట్టు నుంచి పచ్చి బొప్పాయి కాయలు తెచ్చి కూర చేసుకుంటున్నాం. అసలే తుపానువల్ల తోటలు పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న తాము ఎక్కువ ధర పెట్టి ఎక్కడ కొనగలం? వంట గ్యాస్‌ అయిపోవడంతో బయటే పొయ్యి మీద చేస్తున్నాం.
– బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top