కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో శనివారం శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి అమ్మవారలకు ఎదురుగా శ్రీవారిని కల్యాణ అలంకారంలో కొలువుతీర్చారు.
కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో శనివారం శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి అమ్మవారలకు ఎదురుగా శ్రీవారిని కల్యాణ అలంకారంలో కొలువుతీర్చారు. మహా మంగళసూత్రాలను భక్తులకు దర్శింపజేసి అర్చకులే శ్రీవారి పక్షాన అమ్మవారల గళసీమల్లో అలంకరించారు. భక్తుల గోవిందనామస్మరణలు ప్రతిధ్వనిస్తుండగా ముత్యాల తలంబ్రాలు పోశారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : అరటి పిలకల ఆహ్వానాలు.. మామిడాకుల తోరణాల శుభగీతాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. ఆ ప్రాంగణమంతా పసుపు ఆరబోసినట్టు.. దైవకార్యం జరుగుతున్నట్లు.. చెప్పకనే చెప్పాయి. శ్రీగోవిందమాల భక్తబృంద సేవా సమితి శనివారం కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉదయం స్వామి, అమ్మవారలకు సుప్రభాతం, అర్చన నిర్వహించారు. ఒకవైపు శ్రీదేవి భూదేవి అమ్మవారలను ఎదురుగా శ్రీవారిని కల్యాణ అలంకారంలో కొలువుతీర్చారు.
వేద పండితుల బృందం తొలుత పుణ్యాహవాచనం, కలశప్రతిష్ఠ, గణపతిపూజ, ప్రవరలు, కంకణధారణ తదితర కల్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. అమ్మవారల మహా మంగళసూత్రాలను భక్తులకు దర్శింపజేసి అర్చకులే శ్రీవారి పక్షాన వాటిని అమ్మవారల గళ సీమల్లో అలంకరించారు. భక్తుల గోవిందనామ స్మరణలు ప్రతిధ్వనిస్తుండగా స్వామికి అర్చకులు ముత్యాల తలంబ్రాలు పోశారు. అనంతరం లాజహోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
హాజరైన దేవాదాయ శాఖ మంత్రి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య కల్యాణోత్సవానికి హాజరయ్యారు. అర్చకులు ఆయనచే పూజలు చేయించి హారతులు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి శఠగోప ఆశీస్సులు అందజేశారు. ఆయనతోపాటు పీసీసీ కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
భారీగా భక్తులు:
శ్రీవారి కల్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం స్వామి, అమ్మవారలకు గ్రామోత్సవం నిర్వహించారు.