రాష్ర్టంలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఎనిమిది జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైనా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఎనిమిది జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైనా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. గత మూడో వారంలో ఎడతెరపిలేకుండా కురిసిన కుండపోత వర్షాలతో పెన్‌గంగా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో 400 పైగా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోయి, రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో వందలాది గ్రామాలకు చెందిన లక్షలాది మంది అష్టకష్టాలు అనుభవించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 22,413 ఇళ్లు వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్నాయి. మూడు లక్షలపైగా ఎకరాల్లో వారాల తరబడి నీరు నిలవడంతో పంటలు కుళ్లిపోయాయి. భారీ వర్షాలు, వరదలవల్ల ఏకంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 541 చెరువులు తెగిపోయాయి. 179 గ్రామీణ మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. నాలుగు వేల కిలోమీటర్లకుపైగా రహదారులు కొట్టుకుపోయాయి. జూలై నెల గడిచిపోయి ఆగస్టు రెండో వారం ప్రవేశిస్తున్నా ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయనే అంశంపై ప్రభుత్వానికి లెక్కలందలేదు.
ఎన్యూమరేషనే లేదు: వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలవల్ల అధిక నష్టం వాటిల్లింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే లక్షపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఎన్యూమరేషన్ జరగడంలేదు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, ప్రత్యామ్నాయ విత్తనాలు అందించి మళ్లీ పంటలు పెట్టుకునేలా సహకరించాలనే ఆలోచన సర్కారు చేయడంలేదు. గత 40 ఏళ్లలో లేనంత అధిక వర్షపాతం ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డయింది. గోదావరి లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలమైంది.
గోదావరి జిల్లాల్లో 80పైగా లంక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ కనీసం ఏరియల్ సర్వేకి కూడా వెళ్లలేదు. దెబ్బతిన్న చెరువులు, రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణకు నిధులు కూడా విడుదల చేయలేదు. ముఖ్యమంత్రి కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షలతోనే సరిపెట్టారు. ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉందేమిటి సర్ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వద్ద మరో ఐఏఎస్ అధికారి ప్రస్తావించగా ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉంటే కదా? స్పందించడానికి? విభజన ప్రకటనతో ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. సీఎం గానీ, మంత్రులు గానీ సచివాలయానికి రావడంలేదు. ఉద్యోగులు ఎవరూ పనిచేసే పరిస్థితి లేదు’ అని మరో అధికారి వ్యాఖ్యానించారు. సచివాలయంలోని ఏ బ్లాకులోకి వెళ్లినా సిబ్బంది ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.