కౌలురైతుల సమస్యలపై మాటతప్పిన ప్రభుత్వం | Government missed sake on problems of farmers lease | Sakshi
Sakshi News home page

కౌలురైతుల సమస్యలపై మాటతప్పిన ప్రభుత్వం

Aug 26 2015 3:26 AM | Updated on Sep 3 2017 8:07 AM

కౌలురైతుల సమస్యలపై మాటతప్పిన ప్రభుత్వం

కౌలురైతుల సమస్యలపై మాటతప్పిన ప్రభుత్వం

కౌలురైతుల రుణాల మాఫీతో సహాపలు ఇతర సమస్యల పరిష్కారం...

- సెప్టెంబరు 1, 2 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళన
- కౌలురైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య
తెనాలి :
కౌలురైతుల రుణాల మాఫీతో సహాపలు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు సెప్టెంబరు ఒకటో తేదీన రాష్ట్రంలోని తహశీల్దారు కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్టు కౌలురైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య చెప్పారు. ఆ మర్నాడు 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులను బంద్ చేయించనున్నట్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలోని సీపీఎం కార్యాలయంలో కౌలురైతు సంఘం ముఖ్యుల సమావేశం జరిగింది.
 
జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమలయ్య మాట్లాడుతూ, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపులు, రుణఅర్హత గుర్తింపు కలిగిన కౌలురైతుల రుణాలు రూ.574 కోట్లను మాఫీ చేస్తామని హామీనిచ్చిన చంద్రబాబు, 60 శాతం మాత్రమే మాఫీ చేసినట్టు చెప్పారు. ఆధార్ లేదనీ, పంట లేదనీ, రకరకాల కారణాలతో మిగిలిన కౌలురైతులకు మాఫీ చేయటం లేదని, బ్యాంకులకు వెళితే రుణంపై వడ్డీ చెల్లించమని వత్తిడి చేస్తున్నట్టు చెప్పారు. హామీనిచ్చిన విధంగా చిత్తశుద్ధితో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 70 శాతం భూములను సాగుచేస్తోంది కౌలురైతులేనని గుర్తుచేస్తూ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన రూ.65 వేల కోట్ల రుణాల్లో ఆ ప్రకారం కౌలురైతులకు ఇవ్వాల్సి ఉందన్నారు.

ఇందుకు భిన్నంగా బ్యాంకులు భూమి యజమానులకే రుణాలను కట్టబెడుతున్నట్టు విమర్శించారు. ఖరీఫ్ సీజను ఆరంభమైనా ఇప్పటికి ఒక్క కౌలురైతుకూ రుణం ఇవ్వలేదన్నారు. పట్టిసీమ నుంచి ఇప్పటికీ నీరు రావటం లేదని, పులిచింతల సంగతీ అంతేనని చెబుతూ, ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తిచేయనందునే రైతులకు ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు ఎదరయ్యాయని ఆరోపించారు. 15 వేల ఎకరాల భూమి బ్యాంకుకు ప్రభుత్వం సన్నాహాలు చేయటం ఆహారభద్రత చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాగలన్నారు.

ఈ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి, కౌలురైతులు ఎం.శివసాంబిరెడ్డి, ఎం.థామస్, దేవరపల్లి ఇమ్మానుయేలు, కుర్రి వెంకటరెడ్డి, వల్లభనేని సుబ్బారావు, చిలకా ప్రకాశం, మొవ్వా శ్రీనివాసరావు, బూదాటి సాంబశివరావు, ఎం.రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement