జనం ‘గొంతుక’పై ఫైబర్‌ కత్తి | The government has new 'scheme' | Sakshi
Sakshi News home page

జనం ‘గొంతుక’పై ఫైబర్‌ కత్తి

Dec 27 2017 2:01 AM | Updated on Jun 2 2018 2:36 PM

The government has new 'scheme' - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేసి మొత్తం చానళ్ల ప్రసారాలను తన అదుపులో ఉంచుకోవడం కోసం ఉద్దేశించిన ‘ఫైబర్‌ గ్రిడ్‌ పథకం’పై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా దానిని ముందుకు తీసుకువెళ్లడానికే రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ అనుకూల కేబుల్‌ ఆపరేటర్లకు ఫైబర్‌ గ్రిడ్‌ ఏజెన్సీలను కట్టబెట్టడం ఇప్పటికే పూర్తయిపోయింది. ఎంపిక ప్రక్రియకు ఎలాంటి నిబంధనలనూ పాటించకుండా తమవాళ్లందరికీ ఏజెన్సీలిచ్చేవారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు, ఇతరులకు చెందిన కేబుల్‌ సంస్థల వైర్లన్నిటినీ తొలగించేందుకు మళ్లీ కసరత్తు మొదలయ్యింది. వైర్లను తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం గతంలో విద్యుత్‌ సంస్థలను ప్రయోగించింది. అయితే కేసులు నమోదవడం, కోర్టులు అక్షింతలు వేయడంతో ఆ ప్రయత్నం వికటించింది.

ఇపుడు స్థానిక సంస్థల అధికారులను ఈ పనికి నియోగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేబుల్‌ ఆపరేటర్లలో మళ్లీ ఆందోళన మొదలయ్యింది.  రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్‌ సౌకర్యం అంటూ  ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఆకర్షణీయ ప్రకటనలను గుప్పిస్తున్నా ప్రభుత్వ అసలు ఎజెండా మాత్రం ప్రతిపక్ష పార్టీలు, ఇతరులకు చెందిన కేబుల్‌ ఆపరేటర్లు లేకుండా చేయడమేనన్నది బహిరంగ రహస్యం. కేబుల్‌ ఆపరేటర్‌ మనవాడైతే మనకు నచ్చని చానళ్ల ప్రసారాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలిపివేయవచ్చు. అదీ ఈ ‘పథకం’ ముఖ్య ఉద్దేశం.  

వైర్లను తొలగించే బాధ్యత స్థానిక అధికారులకు..
ఆపరేటర్లను అడ్డుతొలగించుకుని, వ్యతిరేక మీడియా గొంతు నొక్కడం కోసం ‘ఫైబర్‌ గ్రిడ్‌ పథకం’ రూపొందించిన ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడానికి అనేక దారులను అన్వేషిస్తోంది. ఇందుకోసం రెండు రోజుల క్రితం ప్రభుత్వ అనుకూల కేబుల్‌ ఆపరేటర్లతో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ వద్ద ఓ సమావేశం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన, ఇతర కేబుల్‌ ఆపరేటర్ల వైర్లను తొలగించడంతో పాటు కొత్త కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటేనే ఫైబర్‌ గ్రిడ్‌ పథకాన్ని తాము ముందుకు తీసుకెళ్ల గలుగుతామని ప్రభుత్వ అనుకూల కేబుల్‌ ఆపరేటర్లు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే వైర్లను తొలగించే బాధ్యతను విద్యుత్‌ సంస్థలకు అప్పగిస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోర్టులు అక్షింతలు వేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. ఈసారి స్థానిక సంస్థల్లో ఉన్న అధికారులకు ఆ బాధ్యత అప్పగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అంటే పంచాయతీ కార్యదర్శి మొదలు కమిషనర్‌ వరకూ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటారన్నమాట. అయితే ఫైబర్‌ గ్రిడ్‌ పథకాన్ని రాష్ట్రపతి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఈ వైర్ల తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

గతంలో పోలీసులనూ ప్రయోగించారు..
కేబుల్‌ వైర్లను తొలగించే పనిని విద్యుత్‌ సంస్థలకు అప్పగించడమే కాక అందుకోసం అవసరమైతే పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి సూచనలు జారీచేశాయి. ఈ మేరకు 2016 డిసెంబర్‌ 24న ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు మెమో (2175/16)ను జారీచేశారు. పోలీసుల సహాయం తీసుకుని మరీ తొలగించాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2016 నవంబర్‌ 16న జరిగిన సమావేశంలో ఆదేశాలు జారీచేశారని కూడా ఈ మెమోలో స్పష్టం చేశారు. అయితే కేబుల్‌ ఆపరేటర్లు కోర్టులను ఆశ్రయించడంతో వారి ఆటలు సాగలేదు.
   
వినియోగదారులపై అదనపు భారం
కేవలం రూ.149కే ఇంటర్నెట్, టీవీ, ఫోన్‌ సదుపాయం అని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం వాస్తవానికి వినియోగదారులపై అదనపు భారం మోపనుంది. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం కింద ఈ సదుపాయాలు అందాలంటే సెట్‌టాప్‌ బాక్స్‌ కోసం రూ.4 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఇప్పటికే టీవీలకు అమర్చుకున్న సెట్‌టాప్‌ బాక్స్‌లపై కొత్త సర్వీసు అందించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో రూ.2 వేలు వెచ్చించి కొనుగోలు చేసిన సెట్‌టాప్‌ బాక్సులు నిరుపయోగంగా మారనున్నాయని వినియోగదారులలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనితో పాటుగా రూ.149ల నెలవారీ బిల్లుకు అదనంగా పన్నులను కలిపి మొత్తం రూ.230 మేరకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం ఎక్కడా చెప్పడం లేదు.   

నిబంధనలు లేవు.. నచ్చినోళ్లే ఆపరేటర్లు..
ఫైబర్‌ గ్రిడ్‌ పథకం అమలుచేయడానికి బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఆపరేటర్లను ఎంపిక చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం దానిని పక్కన పెట్టి నచ్చినవాళ్లకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం అమలు ప్రక్రియ మొత్తాన్ని అధికారపార్టీకి అనుకూలురైన కేబుల్‌ ఆపరేటర్ల చేతిలో పెట్టారు. ఎటువంటి బిడ్డింగ్, టెండర్‌ నిర్వహించకుండానే ఆయా సర్కిళ్లను అప్పగించి అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ఏజెన్సీని కర్నూలు కేంద్రంలో డిప్యూటీ సీఎం బంధువులకు అప్పగించగా...నంద్యాలలో భూమా కుటుంబానికి చెందిన కేబుల్‌ సంస్థకు దక్కింది.

రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో అధికారపార్టీకి చెందిన కేబుల్‌ ఆపరేటర్లకే అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్‌లకు అప్పగించారు. వీరిద్దరూ అధికారపార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే. కాకినాడ, రాజమండ్రిలో కొండలరావుకు చెందిన వెంకటసాయి కేబుల్‌ సంస్థకు అప్పగించారు. కొండల్‌రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్‌గా కొనసాగుతున్నారు. వైఎస్సార్‌ కడపలో జ్యోతి కేబుల్‌కు కూడా అప్పగించారు. ఇది అధికారపార్టీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందినది. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిటీ కేబుల్‌కు ఫైబర్‌గ్రిడ్‌ ఏజెన్సీ అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement