సర్కారు అందించే పథకాలు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నాయి.
► నాడు అంగన్వాడీ, షిప్ట్ ఆపరేటర్ల పోస్టుల విక్రయం
► మొన్న రేషన్‌కార్డులు, పింఛన్లకు ఆమ్యామ్యాలు...
► పథకం వచ్చిందంటే తమ్ముళ్ల పంట పండినట్టే...
► కాసులే పరమావధిగా లబ్ధిదారుల ఎంపిక
సర్కారు అందించే పథకాల లక్ష్యాన్ని మార్చేస్తున్నారు. కాసులే లక్ష్యంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తొలుత అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు... అటు తరువాత విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు... మొన్నటికి మొన్న పింఛన్లు... రేషన్‌కార్డులు... ఇప్పుడేమో ఇళ్లు. వరుసగా వస్తున్న ఏ అవకాశాన్నీ తమ్ముళ్లు వదులుకోవడం లేదు. దరఖాస్తులు ఎక్కువ... మంజూరైనవి తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువై రేటు మరింత పెంచేస్తున్నారు. మళ్లీ... మళ్లీ వస్తుందో రాదోనన్న ఆందోళనతో వారడిగినంతా ఇచ్చి... వాటిని దక్కించుకుంటున్నారు.
విజయనగరం : సర్కారు అందించే పథకాలు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీదానికీ ఓ రేటు నిర్ణయించేసి వసూలే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంగన్వాడీ పోస్టులను ఏ విధంగా అమ్ముకున్నారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు వేశారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. వీటిద్వారానే కోట్లాది రూపాయలు ఆర్జించారు. ముడుపుల బాగోతాన్ని కొందరైతే బాహాటంగానే బయటపెట్టారు. అటు తరువాత విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులైతే చెప్పనక్కర్లేదు. నియోజకవర్గాల వారీగా వాటాలేసుకుని అమ్ముకున్నారు. బొబ్బిలి, సాలూరు సబ్ డివిజన్‌ల పరిధిలో వాటాలు కుదరకపోవడంతో నియామకాలు సక్రమంగా జరగలేదని అధికారపార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
సంక్షేమ పథకాల ముసుగులో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్యాచురేషన్( సంతృప్తి) పద్ధతిలో సంక్షేమ పథకాలు మంజూరు చేశారు. అర్హులైన వారందరికీ ఆ ఫలాలు అందాయి. అప్పట్లో ముడుపులు ముట్టజెప్పాల్సిన పని ఉండేది కాదు. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాల్లో కొంత తేడా వచ్చినప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్యాచురేషన్ అనేది లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో మంజూరు చేయడంతో పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు.
రేషన్ కార్డు కోసం రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు ముడుపులు తీసుకున్నట్టు విమర్శలు వచ్చాయి. పింఛన్లకైతే రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఫిర్యాదులు కూడా వచ్చాయి. అడ్డగోలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారని బాధితులు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి ఫిర్యాదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు అధికార పార్టీ నేతలే పింఛన్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని రోడ్డెక్కారు. దీనికి ఉదాహరణగా జియ్యమ్మవలస మండలాన్నే తీసుకోవచ్చు. ఇక్కడ, లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని, అనర్హులకు లబ్ధి చేకూర్చారని టీడీపీకి చెందిన ఎంపీపీ దత్తి కామేశ్వరి, ఆ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నేరుగా గ్రీవెన్స్‌సెల్‌కొచ్చి ఫిర్యాదు చేశారు. దీన్నిబట్టి పింఛన్ల మంజూరులో పెద్ద ఎత్తున చేతులు మారాయన్నది స్పష్టమయ్యింది.
హౌస్ ఫర్ ఆల్‌తో వసూళ్లు మొదలు
ఏడాదిన్నర క్రితం కేంద్రప్రభుత్వం ప్రకటించిన హౌస్‌ఫర్ ఆల్ స్కీమ్ అమలు కాకముందే టీడీపీ నేతలు వసూళ్లకు తెగబడ్డారు. ప్రభుత్వమే పూర్తిగా నిర్మించి ఇవ్వనుందనే ప్రకటనతో అర్హులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల రద్దీని టీడీపీ నేతలు క్యాష్ చేసుకున్నారు. మంజూరు పేరుతో ఒక్కొక్క ఇంటికి రూ. 15వేల నుంచి రూ. 30వేల వరకు ముడుపులు తీసుకున్నారు. మున్సిపాల్టీల్లో జరిగిన వసూళ్ల దందా అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. విజయనగరం మున్సిపాల్టీని తీసుకుంటే స్థలం, ఇళ్లు లేని వారి కోసం 4,500ఇళ్లు అని, స్థలం ఉండి ఇళ్లు లేని వారి కోసం 4,300ఇళ్లు మంజూరైనట్టు అప్పట్లో అధికారులు ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత అధికారం వచ్చిందని...సొమ్ము చేసుకోవడానికి ఇదొక అవకాశంగా ఎంచుకున్న తమ్ముళ్లు ఇళ్లను అనధికారికంగా పంచేసుకున్నారు.
టీడీపీకి చెందిన ఒక్కో కౌన్సిలర్‌కు 50చొప్పున వాటాలేసేశారు. మిగతా వాటిని నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమ అనుయాయులుగా ఉన్న వారికి కేటాయించారు. కొందరు కౌన్సిలర్లు తమకు కేటాయించిన ఇళ్లను ఎంచక్కా బేరం పెట్టేశారు. ఇల్లు కావాలంటే రూ. 15వేల నుంచి రూ. 30వేల వరకు ముట్టజెప్పాలని నేరుగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల రామకృష్ణకు చెందిన 13వ వార్డు ప్రజలే నేరుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇళ్లు అమ్ముకున్నారని బాహాటంగానే నినాదాలు చేశారు. ఈ వ్యవహారమంతా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికెళ్లింది. అయితే, హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ అమల్లోకి రాకపోవడంతో అవినీతి బాగోతం కాస్త సద్దుమణిగింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఇళ్ల పేరుతో
ప్రస్తుతం ఎన్టీఆర్ ఇళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్టీఆర్ రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద జిల్లాకు 19,437ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ నేతలు కేటాయించేసుకున్నారు. వారికి నచ్చినోళ్లను లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 16,637మందికి ఇళ్లు మంజూరు చేశారు.
రూరల్ హౌసింగ్ కింద 9118, అర్బన్ హౌసింగ్ కింద 6641, ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 878ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడీ లబ్ధిదారుల నుంచి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 5వేల నుంచి రూ. 30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వసూళ్ల బాధ్యతను వార్డుల వారీగా కొందరికి అప్పగించారు.
ఇప్పుడా పనిలో ద్వితీయశ్రేణి నాయకులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల తొలి విడత బిల్లు రాకుండానే ముడుపులు ఎలా ఇవ్వగలమంటూ కొందరు మొండికేస్తున్నారు. అయినా వదలడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలిందేనంటూ పట్టుబడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమయ్యింది.