గోదావరి జలాల తరలింపుపై రచ్చ

Godavari Water Dispute In AP Assembly - Sakshi

కృష్ణాలో నీటి లభ్యత తగ్గడంతో గోదావరి జలాలే శరణ్యమన్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

 శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న చంద్రబాబు 

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని, వెనుకడుగు వేసేదిలేదని  సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

కృష్ణా డెల్టా ఎండిపోతున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్న.. ప్రతీదీ రాజకీయం చేయడం తగదని హితవు

జగన్‌ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తిప్పికొట్టిన అధికారపక్షం 

మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు పట్టు.. తిరస్కరించిన స్పీకర్

బిల్లును అడ్డుకోవడానికి యత్నించిన నలుగురు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ 

సాక్షి, అమరావతి : శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు గోదావరి జలాల తరలింపుపై గురువారం శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. గోదావరి జలాల మళ్లింపుపై సభలో స్వల్పకాలిక చర్చను జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోందని చెప్పారు. కర్ణాటక ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును పెంచే పనులు చేపట్టిందని, దీనివల్ల శ్రీశైలానికి 270 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. తుంగభద్ర నదిలోనూ నీటి లభ్యత తగ్గుతోందని పేర్కొన్నారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు వాటా మేరకు నీరు రావడం లేదన్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని, పెన్నా అహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి 0.38 టీఎంసీలు మాత్రమే వచ్చాయని.. నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు రిజర్వాయర్‌లలోనూ నీటి లభ్యత తగ్గిపోయిందని మంత్రి వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు మళ్లిస్తే.. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని స్వాగతించాల్సింది పోయి తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ నిధులతో తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే ఆ నీళ్లు శ్రీశైలానికి చేరే అవకాశం ఉండదన్నారు. వైఎస్సార్‌పీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ... రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే శ్రీశైలానికి గోదావరి జలాలను తరలించడం ఒక్కటే మార్గమని తేల్చిచెప్పారు. 

దాని ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం 
చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ నిధులతో తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలించడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లవుతుందని అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు విడుదల చేయడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు అంగీకరించాయని, ఒప్పందం చేసుకున్నాయని, కానీ ఏ ఒక్క రోజు కూడా చెన్నైకి నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు కేసీఆర్‌.. మీరు బాగున్నారు. రేప్పొద్దున ప్రభుత్వాలు మారి విభేదాలు వస్తే పరిస్థితి ఏమిటి’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చంద్రబాబు చెప్పేవన్నీ అవాస్తవాలే..
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. లిఫ్టింగ్‌ విధానం వచ్చాక ఎక్కడ కావాలంటే అక్కడ బ్యారేజీలు పెట్టి నీళ్లు లిఫ్ట్‌ చేసుకునే అవకాశం ఉందని, విద్యుత్‌ చార్జీలు తగ్గటం ప్రారంభమయ్యాక అది సులభతరమైందని గుర్తు చేశారు. మన రాష్ట్ర భూభాగం నుంచి పెన్నా బేసిన్‌కు గోదావరి జలాలను తరలించాలంటే 700 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలని, బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ కట్టాలని, తెలంగాణ భూభాగం నుంచైతే శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు 300 కిలోమీటర్ల పొడవున తవ్వే కాలువ ద్వారా గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయం ఏదీ తీసుకోబోమని బుగ్గన అన్నారు. 

ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యుల రాద్ధాంతం 
గోదావరి జలాల మళ్లింపుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే సమయంలో చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అడ్డుతగలగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారించారు. కానీ, చర్చలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌పై నాకు ఎలాంటి ప్రేమా లేకపోవచ్చు. కానీ ఆయన మంచివారు. మంచి చేయడానికే ముందడుగు వేస్తున్నారు’’ అనగానే చంద్రబాబు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్‌ అంగీకరించకపోవడంతో పోడియంను చట్టుముట్టాలని తన పార్టీ సభ్యులకు చంద్రబాబు సైగలు చేశారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లారు. స్పీకర్‌ను చుట్టుముట్టి, నినాదాలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే మాటలు వినిపించకుండా రాద్ధాంతం చేశారు. ప్రతిపక్ష సభ్యుల హంగామా మధ్యనే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పంట సాగుదారుల హక్కుల బిల్లు–2019 లక్ష్యాలను, ఉద్దేశాలను వివరించి.. ఆమోదించాలని కోరేందుకు చర్చను ప్రారంభించారు. అయినా సరే చంద్రబాబు వెనక్కి తగ్గకుండా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. 

చర్చ ముగిశాక మళ్లీ అవకాశం ఎలా కల్పిస్తామని స్పీకర్‌ ప్రశ్నించారు. బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డు తగులుతుండటంతో.. సభా సమయాన్ని వృథా చేస్తున్న సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని.. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్‌కుమార్, బాల వీరాంజనేయస్వామి, అశోక్‌ను ఒక రోజు సస్పెండ్‌ చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ ఆమోదించడంతో వారిని ఒక రోజుపాటు స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ చంద్రబాబు, ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top