గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఘనంగా నిర్వహిస్తామని, ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదంటూ మొదట చేసుకున్న ప్రచారానికి విరుద్ధంగా..
* గోదావరి మహాపర్వానికి ఎంతైనా ఇస్తామని తొలుత చెప్పిన ప్రభుత్వం
* చివరకు రూ.100 కోట్లే ఇవ్వనున్నట్టు ప్రకటన
* అందులోనూ తొలి విడత ఇచ్చేది రూ.30 కోట్లే
* ఏ పనులు చేయాలనేదానిపై నేటికీ రాని స్పష్టత
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఘనంగా నిర్వహిస్తామని, ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదంటూ మొదట చేసుకున్న ప్రచారానికి విరుద్ధంగా.. రూ.100 కోట్లు మాత్రమే ఇస్తామంటూ తూతూమంత్రంగా పనులు కానిచ్చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మొత్తంలో తొలుత రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారు. కానీ ఏ శాఖకు ఎంతనేది ఇంకా లెక్క తేల్చలేదు. ఇందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పట్టవచ్చని చెబుతున్నారు. అయితే మరో 45 రోజుల్లో కేటాయింపులు ఫైనల్ చేస్తామని యనమల అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే పుష్కరాలకు మూడు నెలల ముందు పనులు చేపట్టి పైపై మెరుగులతో కానిచ్చేసేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గిరి గీస్తున్నారు
ఇప్పటివరకూ జరిగిన పుష్కరాలకు సంబంధించి ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించేవారు. నాటి పుష్కరాల పనులు మరో పుష్కరాల వరకూ కూడా నిలిచిపోయేలా ఏర్పాట్లు జరిగాయి. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రభుత్వం గిరి గీసుకుని మరీ ఏర్పాట్లకు పూనుకుంటోంది. పుష్కరాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ ఆగస్ట్ ఎనిమిదిన యనమల అధ్యక్షతన రాజమండ్రిలో తొలి సమావేశం జరిపింది. ఇందులో అధికారులు సుమారు రూ.750 కోట్లతో అంచనాలు సమర్పించారు. పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామంటూ అంతకుముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించడంతో అధికారులు కూడా భారీగా అంచనాలు వేశారు.
కానీ ఈ అంచనాలను తారుమారు చేస్తూ పుష్కరాలకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు యనమల ప్రకటించారు. దీంతో అంచనాలను సుమారు రూ.450 కోట్లకు అధికారులు కుదించారు. చివరికి దీనిని కూడా కాదని, రూ.130 కోట్లకు దాటకూడదని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ స్పష్టం చేశారు. కాకుంటే మరో రూ.కోటి అని అప్పట్లో చెప్పారు. ఎంత కుదించినా రూ.271 కోట్లు కావాలని సెప్టెంబర్ 26న రాజమండ్రిలో కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు అధికారులు తుది అంచనాలు ఇచ్చారు.
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుందని వారు భావిస్తున్న తరుణంలో.. తాను ముందు చెప్పిన రూ.100 కోట్లనే యనమల ఫైనల్ చేశారు. కలెక్టర్ పంపిన నివేదికలను వడబోసి చేపట్టాల్సిన పనులపై సుమారు 45 రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పారు. ముందుగా రూ.30 కోట్లు విడుదల చేయాల్సిందిగా తమ శాఖను ఆదేశిస్తామని చెప్పారు. పుష్కరాల పనుల్లో కీలకమైన ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, దేవాదాయ శాఖలు కనీస ఏర్పాట్లు చేయడానికే రూ.187 కోట్లు కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎంత ఇస్తుందో, ఏ పనులకు పరిమితం కావాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
శాఖలవారీగా ప్రతిపాదనలివీ...
సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌కు వివిధ శాఖలు ప్రతిపాదనలు అందించాయి. ఆర్‌అండ్‌బీ శాఖ రూ.70 కోట్లతో పనులు ప్రతిపాదించింది. జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, ఇతర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్లతో ప్రతిపాదనలు అందించింది. ఇరిగేషన్ శాఖ కూడా సుమారు రూ.55 కోట్లతో అంచనాలు ఇచ్చింది.
పుష్కరాల ప్రధాన వేదిక అయిన రాజమండ్రిలో ఏర్పాట్లకు రూ.30 కోట్లతో నగరపాలక సంస్థ ప్రతిపాదనలు చేసింది. జిల్లా పంచాయతీ అధికారి రూ.6 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్‌టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 లక్షలు, ట్రాఫిక్ పోలీసులు రూ.8 లక్షలు, ఈపీడీసీఎల్ రూ.30 కోట్లతో కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు.