మృగాళ్లకు మాండ్ర శివానందరెడ్డి అండ ..

Girls' Parents Say Mandira Sivananda Reddy Tried to Rid the Accused of Sexually Assaulting a Girl - Sakshi

సాక్షి, కర్నూలు సిటీ : బాధితుల పక్షాన నిలవాల్సిన పాలకులు.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారు. అభం శుభం తెలియని గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా మృతికి కారణమైన వారిని కాపాడుతున్నారు. పోలీసులపై సైతం ఒత్తిళ్లు తెచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ అధినేత కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో  పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ శంకర్‌ (అసోసియేట్‌ ప్రొఫెసర్‌) 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్‌ చేసినట్లు నిర్ధా«రించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి స్కూల్‌ అధినేత వి.జనార్దన్‌రెడ్డి, కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేశారు.

నిందితులపై పోలీసులు సెక్షన్‌ 302, 201, ఫోక్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణకు కలెక్టర్‌ ముందుగా త్రి సభ్య కమిటీని, ఆ తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి..హత్య చేశారని ఈ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. 

మృగాళ్లకు అండగా టీడీపీ నేతలు! 
ప్రీతి చదువులో అందరి కంటే ముందు ఉండేది. ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకొని చదివేది. స్కూల్‌లో 2017 ఆగస్టు 19న ఉదయం నిర్జీవంగా పడివుంది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని యాజమాన్యం ముందుగా సమాచారం ఇచ్చింది. అయితే..తల్లిదండ్రులు అక్కడికి పోయేసరికి నిర్జీవంగా పడివున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా విలపించారు. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాన్ని చూసి వారికి అనుమానం వచ్చింది.

తమ బిడ్డను రేప్‌ చేసి చంపారంటూ అదే రోజు కలెక్టరేట్‌ దగ్గర ఆందోళనకు దిగారు. పోస్టుమార్టంలో సైతం ఇదే విషయం తేలింది. అయితే.. నిందితులను ప్రస్తుతం టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి అప్పట్లో తన ఇంట్లోనే పెట్టుకొని కాపాడారు. అధికార బలంతో పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి.. కేసును సైతం పక్కదోవ పట్టించారు. తద్వారా నిందితులు అరెస్టయిన 23 రోజులకే బెయిల్‌ వచ్చేలా చేశారు.

ఈ కేసును నీరుగార్చేందుకు మాండ్రతో పాటు టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి కూడా అడుగడుగునా ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. కేసును విచారించిన పోలీసులు పోస్టుమార్టం సమయంలో సేకరించిన వాటిని హైదరాబాదులోని ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. రేప్‌లో ఎంత మంది పాల్గొన్నారో నిర్ధారించేందుకు టెస్ట్‌లు చేయించారు. అయితే..ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయించినట్లు విమర్శలున్నాయి.

ఇదిలావుండగా.. కేసు విచారణకు పోస్టుమార్టం చేసిన వైద్యులు సహకరించడం లేదని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)కు పోలీసులు లేఖ రాశారు. దీంతో ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించాలని డీఎంఈ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఆదేశాలిచ్చింది. కమిటీ ఏర్పాటయ్యేలోపు ఫొరెన్సిక్‌ హెచ్‌ఓడీ ఇందులో జోక్యం చేసుకుంటూ తనను కూడా మెంబర్‌గా తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన వైద్యులు డాక్టర్‌ నీరజారెడ్డి, డా.షంషాద్‌ బేగంను సభ్యులుగా నియమిస్తూ, ఫొరెన్సిక్‌ హెచ్‌ఓడీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అయితే, సదరు హెచ్‌ఓడీ మాత్రం విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు, రేప్‌ జరిగి ఉండకపోవచ్చన్న రీతిలో నివేదిక ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో వారు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వారి వినతి మేరకు కమిషన్‌ కేసును సీఐడీకి అప్పగించింది. మూడు రోజులు విచారణ చేసిన సీఐడీ అధికారులు పోస్టుమార్టం రిపోర్ట్‌లో ప్రీతికి సంబంధించిన కొన్ని ఫొటోలు పెట్టారనే కారణంతోనే డాక్టర్‌ శంకర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సస్పెండ్‌ చేశారు.

ఆ తరువాత తమకు న్యాయం చేయాలని హైకోర్టును అశ్రయించిన విద్యార్థిని తల్లిదండ్రులు సీబీఐ విచారణ కోరారు. ఫొరెన్సిక్‌ హెచ్‌ఓడీపై వైద్య, ఆరోగ్యశాఖ సెక్రటరీ, డీఎంఈలకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురు వైద్యులతో కమిటీ వేసి ఇటీవలే ఆ హెచ్‌ఓడీపై విచారణ కూడా పూర్తి చేశారు. హెచ్‌ఓడీ ప్రవర్తనపై వైద్యుల కమిటీ నివేదిక అందజేసింది. 

న్యాయం జరిగే వరకు పోరాటం  
కట్టమంచి స్కూల్‌లో 2017 ఆగస్టు 18వ తేదీ రాత్రి హాస్టల్‌ దగ్గర ఆ స్కూల్‌ యాజమాని కుమారులు మందు పార్టీ చేసుకున్నారు. అందులో పాల్గొన్న వారే మా కూతురును రేప్‌ చేశారని, ఇందులో టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిల పాత్ర ఉందని కేసు పెట్టాం. ఆ రోజు నుంచి కేసు వెనక్కి తీసుకోవాలని చాలా మంది బెదిరిస్తున్నారు. మాలాగా మరో ఏ ఆడ పిల్ల తల్లిదండ్రులకు  అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో న్యాయం కోసం పోరాడుతున్నాం.

నిందితులను కాపాడేందుకు నంద్యాల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి, ఆయన బంధువు గౌరు వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అండతో అన్ని సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి. అఘాయిత్యాలు చేసే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలి.  
– రాజునాయక్, పార్వతిదేవి (ప్రీతి తల్లిదండ్రులు)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top