
గ్యాస్ రాయితీ గోవిందా..!
గ్యాస్ రాయితీ పొందాలంటే వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్యలను ఆయిల్ కంపెనీలకు ఇవ్వాలి.
► ప్రభుత్వ సంస్థలకు అందని సబ్సిడీ
► ఆధార్ అనుసంధానంతోనే ఇబ్బందులు
► భారంగా మారిన అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ
► విద్యార్థుల వసతి గృహాల్లోనూ ఇదే సమస్య
► ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్న నిర్వాహకులు
సాక్షి, కర్నూలు : గ్యాస్ రాయితీ పొందాలంటే వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్యలను ఆయిల్ కంపెనీలకు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం రాయితీ నిధులు వారి ఖాతాలకు జమ చేస్తుంది. ఇప్పుడు ఈ నిబంధన ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారి.. గ్యాస్ రాయితీని దూరం చేస్తోంది. ప్రభుత్వమే దీనిపై మళ్లీ ఆలోచించి సడలింపు ఇవ్వకుంటే భారం తప్పని పరిస్థితి నెలకొంది.
గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న విషయం విదితమే. గతంలో చమురు సంస్థలకు నేరుగా ఈ రాయితీ నిధులు చేరేవి. నగదు బదిలీ పథకం వచ్చిన తరువాత రాయితీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లోకే చేరుతోంది. పూర్తి ధర పెట్టి గ్యాస్ కొనుగోలు చేసిన తరువాత రాయితీ నిధులు వినియోగదారులిచ్చిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అలాగని గ్యాస్ విడుదల చేసిన ప్రతీ వినియోగదారునికి, ప్రతిసారి రాయితీ ఇవ్వడం లేదు. ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే రాయితీ ఇస్తున్న ప్రభుత్వం, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే ఈ లబ్ధి అందిస్తోంది.
రాయితీకి దూరం...
ప్రభుత్వరంగ సంస్థలైన మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, ఇతర సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. జిల్లాలో సుమారు 2,935 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు, 196 ఎస్టీ, ఎస్సీ, బీసీ వసతిగృహాలకు, 56 కళాశాల వసతిగృహాలకు, 5,438 అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరితోపాటు చిన్నతరహా వసతిగృహాలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వంట గ్యాస్ అవసరం ఉంది.
ఇందుకు వీరంతా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇలా చూస్తే జిల్లాలో సుమారు 6 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 8,600 పైగా ప్రభుత్వ రంగ సంస్థలవే ఉన్నాయి. నగదు బదిలీ పథకం రాకముందు వరకు వీరికి రాయితీపైనే గ్యాస్ అందించారు. కొన్ని నెలలుగా రాయితీపై సిలిండర్లు రావడం లేదు. ఈ కనెక్షన్ల ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోవడం వల్లే రాయితీ నిధులు విడుదలవ్వడం లేదని చమురు సంస్థల డీలర్లు చెబుతున్నారు.
ఆధార్ ఎలా..?
రాయితీ రావాలంటే వ్యక్తులు మాదిరిగా బ్యాంకు ఖాతాలు, ఆధార్ సంఖ్యలు ఇవ్వాలి. సంస్థలకు ఇదే పెద్ద సమస్య. బ్యాంకు ఖాతా అయితే సంబంధిత ఏజెన్సీ పేరున ఉంటుంది. లేకుంటే తెరిచి ఇచ్చేయొచ్చు. ఆధార్ సంఖ్య ఇవ్వడమే కష్టమే. గ్యాస్ సిలిండర్లకు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు. వసతిగృహాల సంక్షేమాధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు ఆధార్ సంఖ్యలు ఇవ్వాలి.
వారి ఆధార్ సంఖ్యలు ఇస్తే వారి సొంత అవసరాలకు ఇబ్బంది ఏర్పడతాయి. పోనీ స్వీయ ప్రయోజనాలను త్యజించి ఇచ్చినా బ్యాంకు ఖాతా ఏజెన్సీ, సంబంధిత ఉద్యోగి పేరున ఉంటే ఆధార్ వ్యక్తి సంఖ్యగా ఉంటుంది. ఈ రెండూ లంకెకుదరకపోతే పరిగణలోకి తీసుకోరు. చాలా కనెక్షన్లు వ్యక్తుల పేరున కాకుండా సంస్థల పేరున ఉండడంతో ఆధార్ ఇచ్చే పరిస్థితి లేదు.
ఇలా అయితే నష్టమే...
రాయితీ ఇవ్వకపోవడం వల్ల మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, వసతిగృహాల వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగదు బదిలీ వర్తించకపోవడం వల్ల కొన్ని నెలలుగా రాయితీ పొందలేకపోతున్నారు. పూర్తిస్థాయి ధరకు సిలిండరు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సిలిండర్ రూ. 300కు వరకు నష్టపోతున్నామని ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం మోపుతోంది.
గ్యాస్ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, సిలిండరు విడుదలకు రాష్ట్రం నిధులు ఇస్తోంది. కొన్ని ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ నిమిత్తం కొంత నిధులు అందిస్తోంది. అలాంటి ఏజెన్సీలు అదనపు నిధుల భారం మోయకతప్పదు. కాబట్టి రాయితీ వర్తింపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని, ఆయిల్ కంపెనీలను ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదే అంశాన్ని పౌరసరఫరాల అధికారుల దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘గృహవినియోగదారులకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఆధార్ ఇవ్వలేవు. కాబట్టి వారికి రాయితీ వర్తించదు. దీంతో వారు కొంత నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకోవాలి’ అని సమాధానం చెబుతున్నారు.