గ్యాస్ మంటలు | Gas prices are increased hugely | Sakshi
Sakshi News home page

గ్యాస్ మంటలు

Jan 2 2014 2:35 AM | Updated on Sep 2 2017 2:11 AM

‘మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు’ అన్న చందంగా మారింది గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. అసలే సిలిండర్ ధర పెరిగి అవస్థలు పడుతుంటే ఇది చాలదన్నట్లు చమురు కంపెనీలు సిలిండర్ ధర మరోసారి పెంచేశాయి.

 ‘మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు’ అన్న చందంగా మారింది గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. అసలే సిలిండర్ ధర పెరిగి అవస్థలు పడుతుంటే ఇది చాలదన్నట్లు చమురు కంపెనీలు సిలిండర్  ధర మరోసారి పెంచేశాయి. ఆధార్ అనుసంధానం చేసుకున్న వినియోగదారుడికి ఈ పెరిగే మొత్తం సబ్సిడీగా బ్యాంకు ఖాతాలో జమ కానుండగా, అనుసంధానం చేసుకోనివారిపై మాత్రం భారం పడనుంది. ఆధార్ విషయంలో సుప్రీం తీర్పును సైతం  గ్యాస్ కంపెనీలు లెక్కచేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.
 
 సాక్షి, కడప: జనవరి ఫస్టు కానుకగా ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధర పెంచి సామాన్యుల నడ్డివిరిచాయి. దీనికితోడు రకరకాల నిబంధనలతో వినియోగదారులకు కష్టాలు తప్పేలాలేవు. ఎడాపెడా ధర పెంచడంతోపాటు ఆధార్ అనుసంధానం తప్పని సరి అని ఆయిల్ కంపెనీలు చెబుతుండటంతో వినియోగదారులు హడలి పోతున్నారు. ఆధార్ అను సంధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినా, ఆయిల్ కంపెనీలు పట్టువీడటంలేదు.
 
 జనవరి 31తేదీ లోపల అనుసంధానం చేసుకోకపోతే రూ.1347 చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో నెలలోపు ఆధార్‌తో ఆయిల్ కంపెనీలు, బ్యాంకుల అనుసంధానం పూర్తవుతుందా అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1112నుంచి రూ.1347కు అంటే ఏకంగా రూ.215లకు పెంచడంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీ మొత్తాన్ని సైతం రూ.643 నుంచి 843కు పెంచారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను సైతం రూ.1660నుంచి రూ.2013 కు పెంచడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొమ్మిది సిలిండర్లకు మించి వాడే వినియోగదారుల పరిస్థితి మరీ దారుణంగా తయారు కానుంది.
 
 ఆధార్ అనుసంధానం అంతంత మాత్రమే
 జిల్లాలో గ్యాస్‌కు ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ నమోదు కేవలం 66శాతం మాత్రమే ఉంది. దీంతో పాటు బ్యాంకుతో అనుసంధానం మరీ అధ్వానంగా అంటే 43 శాతం లోపల ఉండటం గమనార్హం. తొలుత సెప్టెంబరు వరకు గడువు ఇచ్చిన ఆయిల్ కంపెనీలు, ఆ గడువు కాస్తా డిసెంబరు 31వతేదీకి పొడిగించారు. సుప్రీం, హైకోర్టులు సైతం గ్యాస్‌కు ఆధార్ అనుసంధానంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో చాలా మంది వినియోగదారులు గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. జనవరి 31వతేదీ లోపు తప్పని సరిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిందేనని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తుండటంతో జిల్లాలో ఈ ప్రక్రియ నెలలోపు పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement