ఒకవైపు విద్యుత్ చార్జీల మోత.. మరో వైపు వ్యాట్ వడ్డనకు ప్రభుత్వం సన్నద్ధం కావడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.
ఒకవైపు విద్యుత్ చార్జీల మోత.. మరో వైపు వ్యాట్ వడ్డనకు ప్రభుత్వం సన్నద్ధం కావడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. అమలు చేయలేని హామీలతో ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రజలను పిండడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు అవగతమవుతోంది. ప్రభుత్వ బొక్కసాన్ని నింపేందుకు బక్క ప్రాణులను సైతం బలిపీఠం ఎక్కించడం ఏలికలకే చెల్లినట్టుంది. ఏరు దాటాక తెప్ప తగలేసే నైజాన్ని చంద్రబాబు మరో సారి రుజువు చేసుకున్నారని నిరూపితమవుతోంది.
రాజధాని పేరిట సారవంతమైన భూములు లాక్కోవడం, గృహ వినియోగదారుడు మొదలు పరిశ్రమల వరకు భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారం వేయనుండడం ప్రజాకంటక పాలనను జ్ఞప్తికి తేకమానదు. రుణ మాఫీలో విఫలమై బ్యాంకులకు వడ్డీలు కట్టించిన ముఖ్యమంత్రి ఈ సారి విద్యుత్ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తేటతెల్లమవుతోంది. చార్జీల పెంపు అన్యాయమనీ, అన్ని రంగాలను దెబ్బ తీయనుందనీ, పొరుగు రాష్ట్రాలలో సబ్సిడీపై సౌర విద్యుత్ అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, భారం మోపనని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారని చంద్రబాబుపై ప్రజలు మండిపడుతున్నారు.