పొలం విషయమై సొంత సోదరుని చంపిన నేరానికిగాను నలుగురికి న్యాయస్థానం యావజ్జీవ కారాగారం విధించింది.
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : పొలం విషయమై సొంత సోదరుని చంపిన నేరానికిగాను నలుగురికి న్యాయస్థానం యావజ్జీవ కారాగారం విధించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డక్కిలి మండలం చీకినేనిపల్లి గ్రామానికి చెందిన సుద్దరాశి శంకయ్య(45)కు అతని సోదరుడైన పోలయ్యకు మధ్య పొలం తగాదాలు నడుస్తున్నాయి. గొడవలు ముదిరిన నేపథ్యంలో 2011 సంవత్సరంలో సుద్దరాశి పోలయ్య, అతని భార్య సావిత్రమ్మ, కుమార్తె రాజమ్మతోపాటు పోలయ్య మరో సోదరుడు భాస్కర్ కలసి శంకరయ్యను గొడ్డలితో నరికి చంపారు.
ఈ ఘటనపై శంకరయ్య భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు కావటంతో శుక్రవారం గూడూరు ఏడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గుర్రప్ప.. నలుగురు నిందితులు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు.