జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, సామాజిక, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, సామాజిక, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కార్యవర్గంలో అధ్యక్షుడితోపాటు ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, 15 మంది సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు 30 నుంచి 60 మంది ఉంటారు. వారితోపాటు కోశాధికారి, ఐదుగురు అధికార ప్రతినిధులను నియమిస్తారు. మండల, గ్రామ స్థాయిలో కూడా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తారు. మండల కమిటీలో పార్టీ అధ్యక్షుడు, ముగ్గురు కార్యదర్శులు, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి ఒకరు, కనీసం 10 మంది కార్యవర్గ సభ్యులను నియమిస్తారు. పంచాయతీ కమిటీలో అధ్యక్షుడితోపాటు ఇద్దరు కార్యదర్శులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు,ఒక కోశాధికారి,కనీసం 8మంది సభ్యులు ఉంటా రు. అదే విధంగా పార్టీ 18 అనుబంధ విభాగాల జిల్లా కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక రాష్ట్ర కార్యవర్గంలో కూడా జిల్లా నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం కల్పిస్తారు.
బూత్ కమిటీలు
ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే బూత్ కమిటీలపై పార్టీ దృష్టి సారించింది. బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంతవరకు కొంత అలసత్వం చూపించారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్రంగానే స్పందించింది. బూత్ కమిటీల ఏర్పాటుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి 80 మంది ఓటర్లకు ఒక సభ్యుడు చొప్పున బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బూత్ కమిటీకి ఒక కన్వీనర్‌తోపాటు 10 నుంచి 20 మంది వరకు సభ్యులుంటారు. అవసరాన్ని బట్టి సభ్యుల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కనీస సభ్యుల సంఖ్య 10కి తగ్గకూడదని స్పష్టం చేశారు.
పనితీరుపై సమీక్ష..
జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాల పనితీరును రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఈ కార్యవర్గాలు నెలకు కనీసం ఒకసారైనా సమావేశమవుతాయి. రెండు నెలలకు ఒకసారి జిల్లా, మండల, గ్రామస్థాయిలో పార్టీ విసృ్తతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ముందుగా వెంటనే ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టాలని రాష్ట్ర పార్టీ ఆదేశించింది. నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని స్పష్టంచేసింది. ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం చేస్తూనే బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతోపాటు విసృ్తతంగా జనబాహుళ్యంలోకి వెళ్లేదిశగా కార్యాచరణ చేపట్టనుంది.
ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా: బాలినేని
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయానికి దోహదపడే దిశగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే బాలినేని ‘సాక్షి’తో చెప్పారు. 15 రోజుల్లో జిల్లా, మండల, పంచాయతీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలో విస్తృత స్థాయి సమావేశం: నూకసాని
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన విధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని వైఎస్సార్ సీపీ కన్వీనర్ నూకసాని బాలాజీ ‘సాక్షి’తో చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బాలినేనితో చర్చించానని తెలిపారు. ఆయన సూచనల మేరకు త్వరలోనే జిల్లా, మండల, పంచాయతీ కార్యవర్గాలను నియమిస్తామన్నారు. అందుకు సన్నాహకంగా త్వరలోనే జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.