రహదారుల విస్తరణపై దృష్టి | Focus on the expansion of roads | Sakshi
Sakshi News home page

రహదారుల విస్తరణపై దృష్టి

Apr 28 2016 4:03 AM | Updated on Sep 3 2017 10:53 PM

సచివాలయానికి రహదారుల ప్రక్షాళనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

సచివాలయానికి ప్రత్యేక మార్గాలు
తాడికొండ శివారు నుంచి తుళ్లూరు రోడ్డుకు బైపాస్ ప్రతిపాదనలు

   
తాడికొండ రూరల్ : సచివాలయానికి రహదారుల ప్రక్షాళనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ, మంగళగిరి ప్రాంతం నుంచి ఇప్పటికే కొంత మేరకు రహదారుల విస్తరణ జరిగిన నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలా మళ్లించాలి అనే అంశాలపైనే దృష్టి సారించారు. ఈ మేరకు ప్రతిపాదనలు గతంలోనే సిద్ధం చేయగా రెండు వారాల్లోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ విభాగాలకు ఆదేశాలు అందాయి. జూన్‌లో తాత్కాలిక రాజధానిలోకి ఉద్యోగులను పూర్తి స్థాయిలో తరలించనున్నారు. గుంటూరుతో పాటు రాజధాని పరిసర గ్రామాల్లో ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, వీఐపీల రాకపోకలు బాగా పెరుగుతాయి.

రోజులో వేల మంది ఈ మార్గం నుంచి ఉదయం సాయంత్ర ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం తుళ్లూరు ప్రాంతానికి సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు వందల సంఖ్యలో గుంటూరు నుంచి వెళుతున్నారు. వీరందరికీ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది. పుష్కరాలకూ రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు నుంచి అమరావతి వరకు రహదారి విస్తరణ చేసేందుకు ఇప్పటికే అమోదం లభించింది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి తుళ్లూరు వెళ్లే రోడ్డులో భారీగా మార్పులు చేయనున్నారు. తాడికొండలో రోడ్లు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గ్రామ శివారు నుంచి బైపాస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ రహదారిపై ప్రణాళికలు వారంలోగా అందించాలని రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. గతంలో డొక్కా మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గుంటూరు వైపు నుంచి వచ్చే రోడ్డులో తాడికొండ శివారు గొడుగు కంపెనీ వద్ద ఉన్న డొంక నుంచి బడేపురం మీదుగా తుళ్లూరు రోడ్డుకు అనుసంధానం చేసేలా బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.

రెండో ప్రత్యామ్నాయ మార్గంగా అదే డొంక నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు మీదుగా కొండ వెనుక నుంచి రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇప్పుడు అవే ప్రతిపాదనలు తిరిగి ఆచరణలోకి తీసుకొనే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న డొంకను ఉన్నట్లుగా తారు రోడ్డుగా మలిచి ట్రాఫిక్‌ను మళ్లించడమా లేక అవసరాన్ని బట్టి 100 లేదా 120 అడుగుల రోడ్డును నిర్మించేందుకు భూమి సేకరించడమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ట్రాఫిక్‌లో మంత్రులు, కలెక్టర్ సీఆర్‌డీఏ అధికారులు ఇరుక్కొని ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారం రోజుల్లోనే దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇక తాడికొండ నుంచి తుళ్లూరు రోడ్డును విస్తరించనున్నారు.


సచివాలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వెలగపూడి వెళ్లేందుకు గుంటూరు నుంచి దగ్గర మార్గంగా శాఖమూరు, ఐనవోలు మీదుగా రోడ్డు ఉన్న నేపథ్యంలో విస్తరించి నూతన శోభను కల్పించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. దీనిపై వారం రోజుల్లోగా స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. మరో రెండు నెలల్లో రహదారుల ప్రక్షాళన చేపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement