మినీ హార్బర్‌కు ‘లంగర్’ | Sakshi
Sakshi News home page

మినీ హార్బర్‌కు ‘లంగర్’

Published Sun, Oct 5 2014 1:48 AM

మినీ హార్బర్‌కు ‘లంగర్’

చీరాల వాడరేవులో మినీహార్బర్ నిర్మిస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. హార్బర్ నిర్మాణ హామీ ఆచరణలోకి రావడం లేదు.
 
చీరాల: స్థానిక వాడరేవులో మినీ హార్బర్ (జెట్టీ) నిర్మిస్తామంటూ పాలకులు ఎన్నో ఏళ్లుగా కోతలు కోస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిపాదిత నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని డబ్బాలు కొడుతూనే ఉన్నారు. కానీ వారి మాటలు హామీల వృక్షంపై పదిలంగా ఉన్నాయి. మత్స్యకారులు మాత్రం హార్బర్ వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు.
 
మత్స్య సంపద ఫుల్..
చీరాల ప్రాంతంలో నెలకు రూ.40 లక్షలకుపైగా మత్య్ససంపద లభిస్తుంది. విలువైన చేపలను స్థానిక మార్కెట్‌తో పాటు విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వేట సాదాసీదాగా ఉండదు. చేపలు పుష్కలంగా పడేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల విలువ చేసే వలలను వినియోగిస్తుంటారు. నియోజకవర్గంలో 4 వేల కుటుంబాల్లోని వారు వేట, అమ్మకాలు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. కానీ వారికి ఎంతో అవసరమైన జెట్టీ లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు బోట్లు పదిలపరచుకోనే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. దీని నిర్మాణంపై నాటి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, చీరాల ప్రజాప్రతినిధులు ఆశ చూపించి పక్కకు తప్పుకున్నారు.

కేంద్ర బృందం పర్యటనకే పరిమితం..
మినీ హార్బర్ కోసం రూ. 300 కోట్ల బడ్జెట్ అంచనా రూపొందింది. అలాగే అనువైన ప్రదేశం, స్థల సేకరణ, సముద్రం లోతు తదితర వసతుల పరిశీలన కోసం 2013 నవంబర్‌లో కేంద్ర బృందం పర్యటించి వెళ్లింది. కానీ ఇప్పటికీ హార్బర్ నిర్మాణంపై ఎలాంటి పనులూ ముందుకు క దల్లేదు. స్థల సేకరణ పూర్తై పనుల జాప్యంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
లంగరు వేయడం ప్రహసనం..
కష్టపడి రాత్రంతా వేటాడిన జాలర్లు తిరిగి తమ బోట్లను ఒడ్డుకు చేర్చి లంగరు వేయాలంటే ముప్పతిప్పలు పడుతున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్య్సకారులు ప్రస్తుతం ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌పై ఉన్న బ్రిడ్జి సమీపంలో బోట్లను కట్టేస్తున్నారు. మండల పరిధిలోని ఇతర జాలర్లు కొన్నేళ్లుగా బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీపంలో లంగరు వేస్తున్నారు.
 
తుపాన్లు వస్తే అంతే..
బంగాళాఖాతంలో తుపాన్లు సంభవించినా.. తీవ్ర వాయుగుండాలు ఏర్పడినా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అలలు ఎగిసి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో బోట్లను ఒడ్డుకు తేవడం చాలా కష్టం. జెట్టీ లేకుండా లంగరు వేస్తే బోట్లు ధ్వంసం అవుతాయి. సాధారణంగా సముద్రంలోనే లంగరు వేసే మత్స్యకారులు.. ఇలాంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రం దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. చేపలను దించడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. చేసేది లేక.. బోట్లను సముద్రంలోనే వదిలేయలేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీరానికి దూరంగా ఎక్కడో భద్రపరచుకోవాల్సి వస్తోంది. వలలదీ ఇదే పరిస్థితి. కానీ దీనివల్ల వారి సామగ్రికి భద్రత కరువవుతోంది.  
 
హామీలతోనే సరిపెట్టారు... పి.విశ్వనాథం...
మినీ హార్బర్ మత్స్యకారుల భవిష్యత్. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించడంలేదు. వేలాదిమందికి ఉపయోగపడే పని చేయడానికి పాలకులకున్న అడ్డంకి ఏమిటో తెలియడంలేదు. వరదలు వచ్చినప్పుడు ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తోంది.

Advertisement
Advertisement