
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశి్చమ–వాయవ్య దిశగా కదులుతుందన్నారు. దీని ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా రాజాంలో 6.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కిలగదలో 5.9, విజయనగరం జిల్లా బొద్దాంలో 5.8, అనకాపల్లి చీడికాడలో 5.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
గురువారానికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశి్చమ–వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. ఇది శనివారం ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశముందని తెలిపింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు.. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.