వంశీ ప్రసంగిస్తే అంత ఉలుకెందుకు?

Finance Minister Buggana Rajendranath Reddy Speech In Assembly - Sakshi

టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన మండిపాటు

ప్రతిపక్ష సభ్యులకు నిధులు ఇవ్వని చరిత్ర టీడీపీది

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విపక్షానికీ నిధులు విడుదల

సాక్షి, అమరావతి: వల్లభనేని వంశీ ప్రసంగిస్తే టీడీపీ సభ్యులకు అంత ఉలుకెందుకని? ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకోవటానికి వంశీ లేస్తే టీడీపీ వాకౌట్‌ చేయడం సరికాదని అన్నారు. ఆంగ్లమాధ్యమం, నియోజకవర్గ సమస్యలను వంశీ చెప్పారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సంద‍ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎంఆర్‌ఎఫ్‌, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. 2016లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశామని, నిధులు ఇవ్వనని చంద్రబాబు సూటిగా చెప్పారని బుగ్గన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయింపులు చేశారని సభలో  వివరించారు.

శాసనసభ రెండో రోజు మంగళవారం శాసనసభ ప్రారంభమైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని అన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రికి చిన్న సూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలగజేసుకొని.. ఐదు సంవత్సరాల నుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్‌ ఉండాల్సినంత వరకు ఉందని అన్నారు. ‘సభలోకి రాగానే వంశీ చేతులు ఎత్తారు. ఏంటి అని అన్నాను. అంతలోనే టీడీపీ సభ్యులు ఏదో ఊహించుకొని. ప్రతిపక్షనాయకుడుని తిట్టబోతున్నారు అనుకున్నారు. వాళ్లు ఎందుకు బయటకుపోయారో, ఎందుకు చిన్నచిన్నగా లోపలికి ఎందుకు వచ్చారో వాళ్లకే తెలియాలి’ అని బుగ్గన అన్నారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి రూల్స్‌ ప్రకారం అడగవచ్చు కదా అని టీడీపీ సభ్యులకు సూచించారు. వల్లభనేని వంశీ మాట్లాడిన ఐదు నిమిషాల్లో తను చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ముఖ్యమంత్రి తీసుకున్ననిర్ణయాలు బాగున్నాయని.. నియోజకవర్గంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లానని వంశీ చెప్పారని బుగ్గన అన్నారు.

‘నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరివాడు. 2014 నుంచి ఈ పద్ధతి మారింది. 2014 వరకు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడు కలిసేందుకు, నియోజకవర్గ పనులు, వ్యక్తిగత పనుల కోసమైనా వెళ్లేందుకు యాక్సెస్‌ ఉండేది. అయితే, 2016లో మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి టీడీపీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తూ.. ఆ తర్వాత ఎక్కడైతే టీడీపీ ఓడిపోయిందో.. అక్కడ టీడీపీ ఇంఛార్జిలకు ఇస్తుంటే.. 46 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోయి చంద్రబాబు నాయుడుని కలిశాం. ఆయన  నేను ఇవ్వను అన్నారు. అప్పటి నుంచి ఓ కొత్త సంస్కృతి ప్రారంభం అయింది’ అని అన్నారు. 

చివరకు, గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులే కాకుండా చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా ఇవ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎవరో ఒక మనిషికి ఆరోగ్యం బాగోలేకనో, యాక్సిడెంట్‌ అయి.. దెబ్బతగిలి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చి అడిగినా రూ.25-30 వేలు ఇవ్వలేదన్నారు.  అంత మానవత్వం లేకుండా విభజించి రూలింగ్‌ పార్టీ, ఆ పార్టీ అంటూ కొత్త సంస్కృతి నేర్పి్స్తే 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక.. టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇస్తున్నారని బుగ్గన పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top