ఫీజులకు ముకుతాడు..

Fee Regulation In Private Education Institutions - Sakshi

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వచ్చే మే 23వ తేదీ తరువాత రాష్ట్రంలో సువర్ణపాలనకు తొలి అడుగు పడనుందా!.. అవుననే అంటున్నాయి రాష్ట్రంలోని అన్ని వర్గాలు. ఇక జిల్లా ప్రజలదీ అదే మాట. 2014వ సంవత్సరంలో తాము చేసిన చిన్న పొరపాటు తమ జీవితాలను ఎంతగా ఛిద్రం చేసిందో ఆ పీడకలను మరిచిపోలేక పోతున్నామంటున్నారు. ముఖ్యంగా దేశ భవిష్యత్‌ను నిర్దేశించే విద్యా రంగానికి పట్టబోయే మహర్దశ గురించే చర్చ నడుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకువస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన సామాన్య ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుండగా, మేధావి వర్గాన్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో ఫీజుల నియంత్రణకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్‌ విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం హర్షణీయమని వివిధ వర్గాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఫీజుల రూపంలో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టే ఇటువంటి చట్టం తీసుకురావడం విప్లవాత్మక మార్పులకు నాంది పలకబోతోందంటున్నారు.

ప్రభుత్వ విద్యకు సమాంతరంగా ప్రైవేట్‌ విద్య
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం చేయాలనుకోవడం సహజం. అదే బలహీనతగా గ్రహించిన ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల పేరిట దారుణ వసూళ్ళకు పాల్పడుతున్నాయి. మార్కులు, ర్యాంకుల మాయాజాలాన్ని సృష్టించి తమ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు ర్యాంకులతో పాటు మంచి భవిష్యత్‌ ఉంటుందని ప్రచారంతో ఊదరగొట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అలా ప్రారంభించిన విద్యా వ్యాపారం ప్రభుత్వ విద్యకు సమాంతరంగా ఎదిగే స్థాయికి చేరుకుంది. అంటే ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 55:45 నిష్పత్తికి చేరుకోవడాన్ని గమనిస్తే ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల ప్రభావం సమాజంపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో పరిస్థితి ఇదీ
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, విద్యార్థుల సంఖ్య సమాంతరంగా ఉన్నాయనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. జిల్లాలో 3,297 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 2,89,765 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే ప్రైవేట్‌ విద్యాసంస్థలు 1,201 ఉండగా వాటిలో 2,47,130 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలురు 12,878 మంది ఉండగా బాలికలు 13,522 మంది ఉన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 30,883 మంది బాలురు, 25,674 మంది బాలికలు ఉన్నారు. అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కన్నా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎంతో అధికంగా ఉన్నారంటే ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 74,843 మంది, బాలికలు 82,358 మంది ఉండగా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో బాలురు 77,773మంది, బాలికలు 60,880 మంది ఉన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో జగన్‌ ప్రకటించిన నిర్ణయం అంతమంది విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపనుంది.

ఇప్పటి వరకూ ఆందోళన ఉండేది
మాది సామాన్య పేద కుటుంబం. మా పిల్లలను స్కూల్‌కు పంపే వయసొస్తోంది. చదివించడానికి ఎన్ని లక్షలు పోయాలో అనే ఆందోళన ఉండేది. జగనన్న మా బెంగ తీర్చారు. ఇకపై కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చదువు కూడా మాలాంటి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కలగడం శుభ పరిణామం.
-కుందేటి గంగాధర్, దుర్గాదేవి దంపతులు

కార్పొరేట్‌ విద్య ఊహకు కూడా భయపడేవాళ్ళం మా పిల్లలను కూడా అందరు పిల్లల్లానే కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చదివించాలనే ఆశ ఉన్నా వాటి ఫీజుల గురించి విని ఆ చదువుకు ఊహించుకుంటేనే భయపడేవాళ్ళం. అటువంటిది ఫీజుల నియంత్రణ జరిగితే మా లాంటి మధ్యతరగతి పిల్లలకూ కార్పొరేట్‌ విద్య సాకారమౌతుంది.
-మెరిపో రాజు, రత్నకుమారి దంపతులు

విద్యారంగంపై స్పష్టమైన విధానం
జగన్‌మోహన్‌రెడ్డికి విద్యా రంగంపై స్పష్టమైన విధానం ఉన్నట్లు అర్థమౌతోంది. ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీకి చెల్లుచీటీ పలికేలా జగన్‌ కీలక నిర్ణయం ఉంది. రాష్ట్రంలో సామాన్యులకు మంచి రోజులు రాబోతున్నాయి.
 – లక్కపోగు రవీంద్రబాబు

ఫీజులు తగ్గితే అంతకన్నా కావలసింది ఏమిటి
ప్రైవేట్‌ స్కూళ్ళలో ఎల్‌కేజీ నుంచే దాదాపు రూ. పది వేలకు పైగా వసూలు చేస్తున్నారు. వాటిపై నియంత్రణ జరిగితే ఫీజులు తగ్గుతాయి. ఫీజులు తగ్గితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ విధానం అమలు జరగాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందే.
– నారం లక్ష్మణరావు, లక్ష్మి దంపతులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top