ఫాతిమా విద్యార్థులపై సీఎం అసహనం.. | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 11:45 AM

fatima college students meet minister kamineni - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి: ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద తనను కలిసిన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అల్లరి చేస్తారా? అని వారిపై మండిపడ్డారు. తాము ఈ విషయమై ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే కనపడడం లేదా? టవర్ ఎక్కి చనిపోతామని బెదిరిస్తారా అంటూ సీఎం చంద్రబాబు నిలదీశారు. చంద్రబాబు తీరుతో ఆ విద్యార్థులు మనస్తాపం చెందారు. 

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు అమరావతి వచ్చారు. మొదట ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావుతో అసెంబ్లీ లాబీలో సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. ఈ వ్యవహారంలో తమ చేతుల్లో ఏమీ లేదని, ఫాతిమా కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని, ఫాతిమా విద్యార్థులు మధ్య  వాగ్వాదం జరిగింది. అనంతరం ఫాతిమా కాలేజీ విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ ఏమేరకు ఎల్లుండి (బుధవారం) మంత్రి కామినేనితో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్లనున్నారు.

కేంద్రమంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి
ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సోమవారం కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను కలిశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించొద్దని, ఇతర కాలేజీల్లో విద్యార్థులను రీలొకేట్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గత 28 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తాననే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. పోలీసులు నచ్చజెప్పడంతో, సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో విద్యార్థులు సెల్‌టవర్‌ దిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement