ప్రకటన సరే..కొనేదెప్పుడు? | Sakshi
Sakshi News home page

ప్రకటన సరే..కొనేదెప్పుడు? 

Published Thu, Apr 19 2018 10:58 AM

Farmers Support Announce Support Prices In Ap - Sakshi

వెల్దుర్తి/కృష్ణగిరి : ఆరుగాలం కష్టపడ్డా, ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గి, మార్కెట్‌లో ధర పతనమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని శనగ రైతులపై ప్రభుత్వం కనికరం చూపడంలేదు. రబీ సీజన్‌లో వర్షాధారంగా ఇరు మండలాల్లో (వెల్దుర్తిలో 823హెక్టార్లు, కృష్ణగిరిలో 500హెక్టార్లలో) 1,323 హెక్టార్లలో శనగ సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.20వేలు ఖర్చు చేశారు. కౌలు రైతులకు అదనంగా రూ.5వేలు ఖర్చు వచ్చింది. మార్కెట్‌లో ధరలేకున్నా అప్పులు తాళలేక కొందరు రైతులు దిగుబడులను ఇప్పటికే నష్టానికి అమ్ముకున్నారు. మరికొందరు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని ఎదురు చూస్తూ దిగుబడులను ఇళ్లల్లోనే దాచుకున్నారు.

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రెండు నెలలుగా మద్దతు ధరకు కొనాల్సిందిగా రైతులు అధికారులను కోరుతూనే ఉన్నా వారి చెవికెక్కడంలేదు. గత ఏడాది మార్కెట్‌లో రూ.8వేలకు మించి పలికిన క్వింటం శనగ ధర ప్రస్తుతం రూ.3,200ల నుంచి రూ.3,600లు మాత్రమే పలుకుతోంది. మరో రెండు నెలల్లో ఖరీఫ్‌ వచ్చే సమయమైందని, వెంటనే తమ దిగుబడులను మద్దతు ధర రూ.4,500కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.   

మద్దతు ధర ప్రకటించినా ఫలితం లేదు 
ప్రభుత్వం శనగలకు మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా అన్నదాతలకు ఫలితం లేదు. పంటలకు పెట్టిన పెట్టుబడులు కట్టుకుందామంటే పంటను అమ్ముకునేందుకు దిక్కే లేదు. మార్కెట్‌లో ధర పూర్తిగా పతనం కావడంతో మద్దతు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పర్మిట్లు రాసిచ్చినా కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. మరో నెల రోజులుంటే ఖరీఫ్‌ ప్రారంభం కాబోతుంది. అధికారుల శనగ రైతులపై కనికరం చూపాలి.         

1/1

– రాజారెడ్డి, టి.గోకులపాడు

Advertisement

తప్పక చదవండి

Advertisement