రైతన్న కష్టాలు..సబ్సిడీ కోసం

Farmers Against to the TDP Government On Beema  - Sakshi

కండువా కప్పుకుంటేనే లబ్ధి...బరితెగించిన టీడీపీ నేతలు

ధర్మవరం నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు

 బియ్యమైనా.. బీమా అయినా ‘అన్న‘ చెప్పాల్సిందే..

 ప్రతిపక్ష పార్టీ వర్గీయులైతే మొండిచేయి 

సాక్షి, ధర్మవరం: ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన అమలు చేస్తుంది. కానీ ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు  ప్రతి పథకాన్నీ తమ రాజకీయ అవసరాలకు డుకుంటున్నారు. లబ్ధిదారులకు  పచ్చ కండువాలు కప్పి తమవారిగా చేసుకున్న తర్వాతే సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. భార్యా భర్తల మధ్య తగవైనా.. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న వివాదమైనా..చంద్రన్న బీమా అయినా.. చేపల చెరువు అయినా ఏదైనా కండువా కప్పుకుంటేనే న్యాయం  జరుగుతుంది.. లేకపోతేఏడ్చి  గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోరు.    

            

నాపేరు కృష్ణయ్య. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి. నేను బోరువద్ద రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టుకున్నా. ఉద్యానశాఖ ప్రోత్సాహకం కింద అందించే డబ్బుకోసం బిల్లు పెడితే ఇయ్యలేదు. ఎంపీఈఓ ఫొటో తీసుకెళ్లినా నాకు బిల్లు రాలేదు. ఎందుకని అడిగితే ‘‘మీరు వైఎస్సార్‌ సీపీ వాళ్లు అందుకని బిల్లు పెట్టనివ్వం’’ అని ఇక్కడి టీడీపీ నేతలు చెబుతున్నారు. చీనీ చెట్లకు బిల్లు పెట్టుకున్నా.. అదీ అంతే. నేను పదేళ్ల కిందట చీనీ మొక్కలు నాటినా బిల్లు ఇయ్యలేదు. సంవత్సరం కూడా కాని చెట్లకేమో బిల్లులిస్తున్నారు. సొసైటీలో రూ.6 వేలు డీడీ కట్టినా.. ఇంతవరకూ రూపాయి కూడా గతిలేదు. చివరకు ఊరంతా సీసీరోడ్లు వేసినా.. మా సందులో మాత్రం ఎయ్యలేదు. వైఎస్సార్‌సీపీ వాళ్లమంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు.’’ప్రభుత్వ తీరు.. అధికార పార్టీ నేతల ఆగడాలపై ఓ రైతు నిస్సహాయత ఇదీ. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో బాధిత రైతును గుర్తించిన ‘సాక్షి’ లోతైన విశ్లేషణ చేయగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

‘‘అన్న చెప్పాడు.. మీ వానికి చంద్రన్న బీమా రావాలంటే పార్టీలో చేరాలంట.. లేకపోతే బీమా ఇయ్యరు. పార్టీలోకి చేరతారో..? బీమా మొత్తం పోగొట్టుకుంటారో...? మీ ఇష్టం..’’ ఇటీవల రోడ్డు ప్రమాదంలో బిడ్డను కోల్పోయి చంద్రన్న బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన మృతుని కుటుంబ సభ్యులకు అధికారపార్టీ నాయకులు జారీ చేసిన హుకుం ఇది.
‘‘మీ భూములను హౌసింగ్‌కు తీసుకుంటారంట..నీవు వచ్చి అన్నను కలిస్తే.. నీకు న్యాయం జరగుతుంది..లేకపోతే అంతే.. నీకు పింఛన్‌ వచ్చింది.. అన్న దగ్గరకు వచ్చిపో.. నీకు ఇళ్లు ఇప్పిస్తాం.. ఒకసారి ఆఫీస్‌ దగ్గరికి వస్తే చాలు’’ 
–ధర్మవరం నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను అధికారపార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు..ఇవి

ధర్మవరం: నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల దాష్టీకానికి లబ్ధిదారులు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాపుతున్నారు. ఏ సంక్షేమ పథకానికైనా తమకు తెలియకుండా లబ్ధిదారులను ఎంపిక చేయవద్దనీ, ఒక వేళ అలా ఎంపిక చేసినా తమకు చెప్పకుండా పథకం వర్తింపచేయవద్దని అధికార పార్టీ నేతలు అధికారులను ఆదేశిస్తున్నారు. వారు చెప్పిట్లు వినేవారికి మాత్రమే పథకాలు అందేలా చూస్తారు. ముఖ్యంగా «పింఛన్లు, హౌసింగ్, చంద్రన్నబీమా, రేషన్‌ కార్డులు, చినీచెట్ల బిల్లులు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే పచ్చకండువా కప్పుకోవడం ఆయా లబ్ధిదారులకు తప్పని సరైంది. కాదు..కూడదంటే నిర్ధాక్షిణ్యంగా సంక్షేమ పథకాలను వారికి దూరం చేస్తున్నారు. 
నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఇలా..
బత్తలపల్లి మండలంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలంటే తప్పనిసరిగా అధికారపార్టీలోకి చేరాలని హుకుం జారీ చేశారు. అందుకు అంగీకరించని వారి దరఖాస్తులను అధికారుల చేత తిరస్కరింపజేశారు.ఇక ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో పండ్ల చెట్లకు సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే తప్పని సరిగా అధికారపార్టీ కండువా కప్పుకోవాలని లేకపోతే లేదని తేల్చిచెప్పారు. అయితే వారి ఒత్తిళ్లలకు తలొగ్గనివారికి నేటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో వారు వీరు అన్న తేడాలేకుండా..అందరికీ ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందేవి. కానీ నేడు ఇలా వ్యవహరించడం పట్ల నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామం. ఈమెకు 189 సర్వే నంబర్‌లో ఐదు ఎకరాల భూమి ఉంది. ఐదు సంవత్సరాల క్రితం పొలంలో 356 మామిడి మొక్కలు నాటుకున్నారు. ఉపాధి పథకం కింద వీటిని సాగు చేశారు. ఇందుకు గాను మూడు సంవత్సరాల్లో రూ.7.30 లక్షలు బిల్లు కావాల్సి ఉంది. అయితే రూ.1.25 లక్షలు మాత్రమే బిల్లు చేసి ఉపాధి సిబ్బంది చేతులు దులుపేసుకున్నారు. మిగిలిన బిల్లులు చేయమంటే ‘‘మీరు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు..మీకు బిల్లులు చేయడం ఇబ్బందిగా ఉంది’’ అని చెబుతున్నారని బాధితురాలు వాపోతోంది. వీరితో పాటు చెట్లు నాటుకున్న రైతులకు మాత్రం మొత్తం బిల్లులు ఇవ్వడం గమనార్హం. - మహిళా రైతు పేరు ఉమ్మడి ఆదిశేషమ్మ.

 ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు. మండల కేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కింద నిధులతో జనసంచారం లేని ప్రాంతాల్లో సైతం సిమెంట్‌ రోడ్లు వేసి నిధులు దిగమింగిన అధికార పార్టీ నేతలు...తమ కాలనీలో మాత్రం రోడ్లు వేయడం లేదని వాపోతున్నారు. తాము వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నామన్న కారణంగా తమ వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. -సాకే లక్ష్మన్న,ధర్మవరం

బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామం. ఈయన గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఒక హెక్టారులో అరటి పంటను సాగు చేశారు. ఈయనతో పాటు నారాయణరెడ్డి, నాగేంద్రమ్మలు సైతం అరటి పంటను సాగు చేశారు. ఇందుకుగాను ప్రభుత్వం హార్టికల్చర్‌ కింద హెక్టారుకు రూ.30,800 చెల్లిస్తుంది. ఈ డబ్బులు ఇవ్వకుండా గ్రామానికి చెందిన జన్మభూమి కమిటి సభ్యులు, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పేరు చెప్పి బిల్లులు చేయకుండా అడ్డుకున్నారు. అదేమని హార్టికల్చర్‌ అధికారులను అడిగితే ‘‘మీకు బిల్లులు చేయవద్దని ఒత్తిడి తీసుకువస్తున్నారు’’ అని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. - గుమ్మడి అనంతరెడ్డి.

పిన్నదరి గ్రామానికి చెందిన ఈయన... సర్వేనంబర్‌ 374లో 4.8 ఎకరాల్లో 330 చీనీచెట్లు సాగు చేశాడు. మొక్క రూ.70 ప్రకారం కొని, మొక్కలు నాటడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. పండ్లతోటల సాగుచేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మహేష్‌ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడని అధికారులకు చెప్పిన టీడీపీ నాయకులు ఆయన దరఖాస్తును పక్కన పెట్టించారు. దీంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. -రైతు టీ.మహేష్‌.

తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి స్వగ్రామం. నాలుగేళ్ల కిత్రం సర్వేనంబర్‌ 284లోని 4.20 ఎకరాల పొలంలో డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ పథకం ద్వారా 294 మామిడి మొక్కలు నాటాడు. మొక్కలను సంరక్షించడానికి (వాచ్‌ అండ్‌ వాటర్‌) నెలకు రూ.10 వేలు ఏడాది పాటు ఇచ్చారు. రామకృష్ణచౌదరి వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటుడటంతో టీడీపీ నాయకులు ఆయన బిల్లులు నిలిపారు. ఇప్పటికి రూ.4 లక్షల వరకు బిల్లులు అందాల్సి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -ఎం.రామకృష్ణచౌదరి,  తాడిమర్రి మండలం

కండువా కప్పుకుంటేనే బిల్లిస్తారంట
నేను 5.20 సెంట్లలో 600 చినీ చెట్లను సాగు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లుల కోసం ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. నేను  వైఎస్సార్‌సీపీకి చెందిన వాడని బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. బిల్లుల కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేశాను. అధికారులు కనికరించలేదు, గ్రామంలో జన్మభూమి కమిటీ వాళ్లతో సంతకాలు చేయించుకు రావాలని అధికారులు సూచించారు. వాళ్లేమో కండువా వేసుకుంటే తప్ప బిల్లులు చేయమని తెగేసి చెప్పుతున్నారు. రైతులకు పార్టీలు అంటగట్టి పథకాలు రాకుండా చేయడం శోచనీయం.
– రాజశేఖర్, నల్లచెర్లోపల్లి, ముదిగుబ్బ మండలం 

మూడేళ్లుగా బిల్లులు చెల్లించలేదు
నేను మూడు ఎకరాల్లో 220 మామిడి చెట్లను పెంచుతున్నాను. ఈ చెట్లను ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్నాను. టీడీపీ అధికారం చేపట్టిన మొదట్లో ఒక బిల్లు మాత్రమే వేశారు. అనంతరం నేను వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడని చెప్పి బిల్లులు రాకుండా నిలిపివేశారు. బిల్లుల కోసం అధికారులు చుట్టు తిరిగినా వారు పట్టించుకోలేదు. – తిరుపాల్‌రెడ్డి, మర్తాడు, ముదిగుబ్బ

టీడీపీలో చేరితే బిల్లులిస్తామని చెబుతున్నారు
ఉపాధి హామీ పథకం కింద మూడున్నర ఎకరంలో మామిడి మొక్కలను రెండేళ్ల కిందట నాటాను. మొక్కలను ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకుని బతికించుకున్నాను. బిల్లుల కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లితే మీ గ్రామంలో ఉన్న జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం పెట్టించుకుని రావాలని ఏపీఓ చెప్పారు. వాళ్ల వద్దకు వెళ్లితే నీవు వైస్సార్‌సీపీ సానుభూతి పరుడివి బిల్లులు ఎలా అయితాయని అనుకుంటున్నారు.. మళ్లీ ఎంపీడీఓ వెంకటరమణ వద్దకు వెళ్లి బతిమాలుకుంటే...ఆయన ‘‘ఇదంతా ఎందుకు నీవు పార్టీ కండువా వేసుకుంటావని చెప్పు వెంటనే ఎమ్మెల్యేతో మాట్లాడి నీ బిల్లులు, నీ బంధువులకు చెందిన బిల్లులను ఒక్కరోజులోనే చేస్తా’’ అని చెప్పాడు. మీరు కుడా ఇలా మాట్లాడాతారా సార్‌..అంటే ‘‘కండువా వేసుకుంటేనే బిల్లుల కోసం కార్యాలయానికి రా.. లేకపోతే రావద్దు’’ అని ఆయన గట్టిగా చెప్పాడు. నాకు రూ.29 వేలు రావాల్సి ఉంది. వీటి కోసం ఆత్మాభిమానం చంపుకోలేనని చెప్పి అక్కడి నుంచి వచ్చా. నా గోడును మా గ్రామం మీదుగా పాదయాత్ర చేసుకుంటు వెళ్లిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం రూపంలో ఇచ్చుకున్నాను.          – చంద్రమోహన్, ఏలుకుంట్ల, బత్తలపల్లి మండలం

ఇచ్చిన బిల్లును తీసుకున్నారు
ఉపాధి హామీ పథకం ద్వారా నేను 5 ఎకరాలలో మామిడి మొక్కలను నాటుకున్నాను. గ్రామంలో వైఎస్సార్‌సీపీకి సానుభూతి పరునిగా ఉంటున్నాను. ఈ విషయాన్ని అధికారులకు చెప్పి జన్మభూమి కమిటీ సభ్యుల బిల్లులు చేయకూడదంటు నిలుపుదల చేశారు. బిల్లుల కోసం జిల్లా కేంద్రంలో జరిగే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చుకున్నాను. వీటికి స్పందించిన అధికారులు పెండింగ్‌లో ఉన్న బిల్లు మొత్తం రూ.70 వేలు పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేశారు. అయితే సాయంత్రం చేతికి డబ్బులు ఇచ్చారు. గంట వ్యవధిలోనే మళ్లీ వచ్చి ‘‘నీ బిల్లులో పొరపాటు ఉందని...లెక్క తేలగానే ఇస్తాం’’ అని చెప్పి డబ్బును ఇప్పించుకుపోయారు. బిల్లు కోసం మళ్లీ వెళ్లితే జన్మభూమి కమిటీ వాళ్లను కలవమని పోస్ట్‌మ్యాన్‌ చెప్పాడు. కమిటీ సభ్యులను అడిగితే ఎమ్మెల్యే సూర్యనారాయణతో కండువా వేయించుకుంటేనే బిల్లు ఇస్తామని చెప్పారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి...టీడీపీ వాళ్లకే చేస్తామనడం సరికాదు.        – కేశప్ప, ఏలుకుంట్ల , బత్తలపల్లి మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top