గోల్‌మాల్‌పై విచారణ | faking SC Corporation responded to the state | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌పై విచారణ

Dec 13 2013 3:10 AM | Updated on Sep 2 2017 1:32 AM

పాత బోర్లకు... కొత్త పంపుసెట్లు కొన్నట్లు నాటకమాడి సబ్సిడీలు మింగేసినబాగోతంపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పందించింది. అయిదుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పాత బోర్లకు... కొత్త పంపుసెట్లు కొన్నట్లు నాటకమాడి సబ్సిడీలు మింగేసినబాగోతంపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పందించింది. అయిదుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. కరీంనగర్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ మంజూరీ చేసిన బోరుబావులు, సబ్‌మెర్సిబుల్ పంపుసెట్ల యూనిట్లలో అవినీతి అవకతవకలపై విచారణ జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న అయిదుగురు ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జయరాజ్ ఈ కమిటీని నియమించారు.  క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులను కలువాలని.. యూనిట్ల మంజూరీలో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదికను అందజేయాలని ఈ కమిటీని ఆదేశించారు. వచ్చేవారంలో ఈ కమిటీ జిల్లాలో పర్యటిస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధ్రువీకరించారు.
 
 ఎస్సీ కార్పొరేషన్‌లో గత సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌లో ఈ గోల్‌మాల్ జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో 274 సబ్ మెర్సిబుల్ పంపుసెట్ల యూనిట్లు మంజూరు కావటం... దాదాపు రూ.57 లక్షల సబ్సిడీ సొమ్ము దుర్వినియోగమైన వైనాన్ని ‘టార్గెట్ గోల్‌మాల్’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన పంపుసెట్ల డీలర్ బ్యాంకర్లు, అక్కడి అధికారులతో కుమ్మక్కై... లబ్ధిదారుల ప్రమేయం లేకుండా సబ్సిడీని మింగేసినట్లుగా వేలెత్తి చూపింది. ఒక్కో యూనిట్‌పై రూ.30 వేల చొప్పున పక్కదారిపట్టడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సొంత జిల్లా కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజునే జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. అసలేం జరిగిందని జిల్లా అధికారులను ఆరా తీశారు.

మరోవైపు తమ బాగోతం బయటపడడంతో కొన్ని మండలాల్లో సబ్సిడీ సొమ్ముతో దాగుడుమూతలాడిన బ్యాంకర్లు, అక్కడి అధికారులు, స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో విచారణకు రానున్న కమిటీ ఏం నిగ్గు తేల్చుతుందో వేచి చూడాల్సిందే.  ఇదే వరుసలో గతంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన జోగినీల పునరావాసం, అవినీతి, అక్రమాలకు సంబంధించి పెండింగ్ ఫైళ్ల దుమ్ము దులుపాలని... బాధ్యుల నుంచి డబ్బు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ ఈనెల 16న జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష నిర్వహించనుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement